ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 19 అక్టోబరు 2022 (16:31 IST)

'ఆక్సి ఎయిడ్'- దేశంలో మొట్టమొదటి ఆక్సిజన్ జనరేటర్ వాహనం గురుదేవ్ రవిశంకర్ చేతుల మీదుగా ఆవిష్కరణ

Sri Sri Ravishankar
దేశవ్యాప్తంగా తలపెట్టిన మెడికల్ ఆక్సిజన్ గ్రిడ్ తయారీలో భాగంగా మొట్టమొదటి అంతర్జాల ఆధారిత సంచార ఆక్సిజన్ జనరేటర్ వాహనాన్ని ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది, శాంతి ప్రవక్త గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఇక్కడి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ఆవిష్కరించారు. ఆక్సిజన్ అవసరమైన చోటనే ఉత్పత్తి చేయటం, సిలిండర్లు నింపే సదుపాయంతో పాటు దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ అవసరమైన వారికి వెంటనే అక్కడికక్కడే లభించేలా చూడటం ఈ గ్రిడ్ లక్ష్యాలు. ఇందులో భాగంగా మొట్టమొదటి ట్రక్కును ఈరోజు ప్రారంభించారు. 
 
వాహనాన్ని ఆవిష్కరిస్తూ గురుదేవ్, "గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సులభంగా, తక్కువ ధరకు మెడికల్ ఆక్సిజన్ అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది." అని ప్రశంసించారు. "ఇది దేశానికి చాలా అవసరమైన కార్యక్రమం. అనేకమంది శాస్త్రవేత్తల సమష్టి కృషితో ఇది సాధ్యమైంది. తక్కువ ఖర్చుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు దీని ద్వారా మెడికల్ ఆక్సిజన్ అందించవచ్చు. వివిధ గ్రామాలకు వీటిని అందించేందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సంపూర్ణ సహకారం అందిస్తుంది." అని వారు పేర్కొన్నారు. 
 
మనదేశంలో అత్యధిక జనాభా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నివసించటం, గ్రామీణ ప్రాంతాలు సమీప పట్టణాలు, నగరాలతో పూర్తిగా అనుసంధానం కలిగి ఉండకపోటం అనే వాస్తవాల ఆధారంగా చూస్తే, గ్రామీణ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ విధానం అక్కడి ప్రజల మెడికల్ ఆక్సిజన్ అవసరాలు తీర్చేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆక్సి ఎయిడ్ వ్యవస్థాపకుడు శ్రీ మల్లికార్జున్ దండినవార్ మాట్లాడుతూ, "ఈ ఆలోచన కోవిడ్ కారణంగా మొదలైంది కాదు. ఐతే కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కు డిమాండ్ బాగా పెరిగిందనేది వాస్తవం" అని పేర్కొన్నారు. "గ్రామీణ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం, రోగులు చికిత్స కోసం పట్టణాలకు వచ్చే అవసరం లేకుండా చూడటం దీని లక్ష్యం. దీనివలన గ్రామీణ ఆస్పత్రుల్లో జవాబుదారీతనం, నైపుణ్యం, స్వావలంబన పెరుగుతాయి. దీనిని సాధించేందుకు అంతర్జాల ఆధారిత ఐఓటీ టెక్నాలజీ గ్రామీణ ఆసుపత్రులలో వాడుకోవలసి ఉంది." అని ఆయన అన్నారు. 
 
అవసరమైనంత ఆక్సిజన్ - అవసరమైన మేరకు - సరసమైన ధరలో - బాధ్యతాయుతమైన రీతిలో - సరియైన పరికరాలతో అందుబాటులో ఉంచడం అనే ఐదు ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. ఈ సవాళ్లను పరిష్కరించేందుకు ఈ క్రింది విధానాలను పాటిస్తున్నారు. 
Sri Sri Ravishankar

1. అవసరమైన వారికి వారి ఇంటి వద్దనే ఆక్సిజన్ అందించడం!! దీనివల్ల పేద ప్రజలకు చాలా సౌకర్యం కలుగుతుంది. సాధారణంగా ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు పారిశ్రామిక వాడల్లో, గ్రామీణ ప్రాంతాలకు దూరంగా ఉంటాయి. వాటి డీలర్లు సైతం పట్టణాల్లోనే ఉంటారు తప్ప, తాలూకా కేంద్రాల్లో కాదు. వారు సైతం పగలు మాత్రమే పని చేస్తారు.
 
2. అందుబాటులో ఆక్సిజన్ : తాలూకా, గ్రామాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచి, వాటి లభ్యత వివరాలను ఐఓటీ టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది. 
 
3. అందుబాటు ధరల్లో : ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకో రోగికి గంటకు రూ.అరవై వరకు, ప్రైవేటు ఆసుపత్రుల్లో దీనికి 3 నుంచి 5 రెట్లు ఖర్చు అవుతుంది. సబ్సిడీ ద్వారా అవసరమైన రోగులకు ఉచితంగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో సిలిండర్ కు ప్రస్తుతం ఉన్న ధర రూ. 200/- నుండి, ఈ ప్రాజెక్టు ఆరంభంలోనే రూ. 80/-కి తేవడం జరిగింది. 
 
4. జవాబుదారీతనం : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ చౌర్యాన్ని అరికట్టడం. ఐఓటీ టెక్నాలజీ ద్వారా సరైన మోతాదులో, శుద్ధమైన ఆక్సిజన్ ను, అవసరమైనంత సమయం అందించడం జరుగుతుంది. 
 
5. సరఫరా వ్యవస్థ : 
1. ప్రతీ తాలూకా లో అందుబాటులో ఉండే అగ్నిమాపక కేంద్రాలను ఆక్సిజన్ నింపే కేంద్రాలుగా వాడుకోవడం. 
 
2. అక్కడి సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వటం ద్వారా రోజులో 24 గంటలు, 365 రోజులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ఇంటి వద్ద ఉండే రోగులకు సైతం ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చూడడం. 
 
3. అధిక జనాభా, అధిక వైశాల్యం కలిగిన మన దేశ గ్రామీణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని, చిట్టచివరి వ్యక్తికి సైతం చేరే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది. 
 
4. మన రాజ్యాంగం కల్పించిన మొట్టమొదటి ప్రాథమిక హక్కు అయిన "జీవించే హక్కు" ను అందరికీ  అందించేందుకు చేపట్టిన జాతీయ ప్రాజెక్టు ఇది.