శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (10:04 IST)

అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్.. హిజ్బుల్ కీలక ఉగ్రవాది హతం

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థ కమాండర్ హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా రిషిపోరా గ్రామం కప్రాన్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 
 
శనివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్-ఉల్-ముజాహిదీన్ టెర్రరిస్ట్ కమాండర్ నిసార్ ఖండే హతమైనట్టు కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. 
 
ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జవాన్లు, ఓ పౌరుడు గాయపడినట్టు పేర్కొన్నారు. వీరిని తక్షణమే శ్రీనగర్‌లోని 92 బేస్ హాస్పిటల్‌కు తరలించి, చికిత్స అందజేస్తున్నామని చెప్పారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు.
 
ఉగ్రవాది నుంచి ఏకే 47 రైఫిల్‌, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని విజయ్ కుమార్ ట్వీట్ చేశారు.  
 
గాలింపులో ఇద్దరు ఉగ్రవాదుల ఆచూకీ లభించిందని, ఆపరేషన్ పూర్తయిన తర్వాత మృతుల సంఖ్యను ప్రకటిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ జరిగిన 56వ ఎన్‌కౌంటర్ ఇది. ఇంతకు ముందు జరిగిన ఆపరేషన్‌లలో 26 మంది పాకిస్థానీలతో సహా 89 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి