గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (16:37 IST)

మనీ లాండరింగ్ కేసు... దావూద్‌ ఇబ్రహీంతో లింకులు.. మహారాష్ట్ర మంత్రి అరెస్టు

మనీ లాండరింగ్ వ్యవహారంలో అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ఆయన ముఠా సభ్యులతో‌ సంబంధాలు కలిగివున్నారన్న ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఈయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా కావడం గమనార్హం. 
 
దావూద్‌తో లింకులపై ఆయన వద్ద ఏడు గంటల పాటు విచారించారు. ఆ తర్వాత అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. మనీలాండరింగ్ కేసులో దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను కొద్దిరోజుల క్రితమే అరెస్టు చేసింది. కస్కర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. 
 
అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. దావూద్ గ్యాంగ్‌తో పాటు ఇతర మాఫియా ముఠాల నుంచి నవాబ్ మాలిక్ భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో కస్కర్ నుంచి రాబట్టిన సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మాలిక్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని ఉదయం 7 గంటల నుంచి విచారణ చేపట్టారు. ఈ విచారణ తర్వాత ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు.