గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (09:08 IST)

ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియాలో కరోనా... 10 లక్షల మంది సంగతేంటి?

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ (స్లమ్ ఏరియా)లో కరోనా వైరస్ ప్రవేశించింది. ఈ వైరస్ దెబ్బకు ఇప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మురికివాడలో నివసించే దాదాపు పది లక్షల మంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఇది ఎక్కడో లేదు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన మహారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై మహానగరంలో ఉంది. ఈ స్లమ్ ఏరియా పేరు ధారావి. మహారాష్ట్రలో ఇప్పటికే 335 కరోనా కేసులు నమోదు కాగా, మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ నేపథ్యంలో ముంబైలోని ధారావి మురికివాడలో కరోనా వైరస్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ధారవిలో నివసిస్తున్న ఓ వ్యక్తి కరోనా అనుమానిత లక్షణాలతో బుధవారం సాయంత్రం సియాన్‌ ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఈ వ్యక్తి నివాసముంటున్న భవనాన్ని అధికారులు సీజ్‌ చేసినట్లు సమాచారం. ఈ భవనంలో ఉంటున్న మిగతా ఏడు కుటుంబాలను హోం క్వారంటైన్‌లో ఉంచారు. వీరందరికి గురువారం కరోనా టెస్టులు నిర్వహించనున్నారు.
 
అయితే, ధారవి మురికివాడలో సుమారుగా 10 లక్షల మంది గుడిసెవాసులు నివసిస్తున్నారు. మరి అక్కడుంటున్న ఓ వ్యక్తి కరోనా వైరస్‌తో చనిపోవడంతో.. మిగతా వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 10 లక్షల మందిలో ఎంత మందికి కరోనా సోకిందో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 59 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జస్‌లోక్‌ ఆస్పత్రిలోని ఔట్‌ పేషెంట్‌ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆ ఆస్పత్రిని మూసివేశారు.