బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2024 (08:44 IST)

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యాకు ప్రధాని నరేంద్ర మోడీ

narendra modi
16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు ఇతర సభ్య దేశాధినేతలతో ఆయన ద్వైపాక్షిక చర్చలు చేపట్టనున్నారు. అలాగే, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 
 
కజాన్ నగరంలో జరిగే ఈ 16వ బ్రిక్స్ సదస్సు ఈ దఫా అత్యంత కీలకంగా మారింది. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య గత యేడాదిన్నర కాలంగా సాగుతున్న యుద్ధంతో ఇజ్రాయేల్ - పాలస్తీనా  - ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం.. మధ్య ఆసియా దేశాల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ శిఖరాగ్ర సదస్సు జరుగబోతుంది. దీంతో ఈ దఫా బ్రిక్స్ సదస్సుకు అత్యంత ప్రాధాన్యత చేకూరింది. 
 
కాగా, బ్రిక్స్ సదస్సుకు హాజరు కావాలంటూ ప్రధాని మోడీకి రష్యా అధినేత పుతిన్ ప్రత్యేక ఆహ్వానం పంపిన విషయం తెల్సిందే. కాగా ఈ యేడాది ప్రధాని మోడీ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. జూలైలో నెలలో మాస్కోలో జరిగిన 22వ భారత్ - రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి కూడా ప్రధాని హాజరయ్యారు. ఆ పర్యటనలో పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతేకాదు రష్యా అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ 'ను అందుకున్నారు.