1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2024 (08:50 IST)

మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామం... ఆ ముగ్గురిని విందుకు ఇంటికి ఆహ్వానించి శరద్ పవార్

sharad pawar
మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ చేసిన ఈ పనికి ప్రతి ఒక్కరూ నివ్వెర పోతున్నారు. తనపై తిరుగుబాటు జెండా ఎగురవేసి ఏకంగా నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీని సొంతం చేసుకున్న తన అన్న కుమారుడు, మహారాష్ట్ర మంత్రి అజిత్ పవార్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లను తన ఇంటికి శరద్ పవార్ విందుకు ఆహ్వానించారు. ఇటీవలే ఎన్సీపీ నుంచి బయటకు వెళ్లి.. నిజమైన ఎన్సీపీ పార్టీ తనదేనంటూ ఎన్నికల సంఘం ఎదుట నిరూపించుకున్న అజిత్ పవార్‌ను ఆయన విందుకు ఆహ్వానించడంతో శరద్ పవార్ అనుచరులు, ఆయన వెన్నంటి ఉండే కార్యకర్తలు నివ్వెరపోతున్నారు. 
 
కాగా, ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్‌లు కలిసి మహారాష్ట్రలోని బారామతిలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభోత్సవానికి శనివారం వస్తున్నారు. బారామతి శరద్ పవార్ సొంత పట్టణం. దీంతో ఆయన స్పందించారు. "రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బారామతికి వస్తున్నారు. బారామతిలో ఆయన నమో మహా రోజ్‌గార్ పథకం ప్రారంభిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమం ముగిశాక ఆయన తన మంత్రివర్గ సహచరులతో కలిసి మా ఇంట్లో భోజనానికి రావాలని ఆహ్వానించాను" అని శరద్ పవార్ పేర్కొన్నారు. 
 
కాగా, దేశంలో ఇది సార్వత్రిక ఎన్నికల సమయం. ఈ ఎన్నికల్లో అజిత్ పవార్ సతీమణి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో విందు రాజకీయానికి అధిక ప్రాధాన్యత నెలకొంది.