శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 జులై 2019 (09:00 IST)

అత్యాచారం చేసింది బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రశ్నించొద్దు : రాహుల్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార ఘటనలో కీలక మలుపుతిరిగింది. ఈ కేసులో ప్రధాన ప్రధాన బాధితురాలు రోడ్డు ప్రమాదానికి గురికావడం ఇపుడు అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. 
 
ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉన్నావో అత్యాచార బాధితురాలు తీవ్రంగా గాయపడగా, ఆమెతో పాటు కారులో ప్రయాణిస్తున్న బంధువుల్లో మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విపక్ష పార్టీల నేతలంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది రోడ్డు ప్రమాదం కాదనీ, ఖచ్చితంగా ఏదో కుట్ర దాగివుందని చెప్పారు.
 
అదేసమయంలో ఈ ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. "భారతీయ మహిళల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ బులిటెన్. మీపై అత్యాచారం చేసిన నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే అయితే ప్రశ్నించొద్దు" అని ట్వీట్ చేశారు. 
 
అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 'బేటీ పడావో.. బేటీ బచావో' పథకాన్ని ప్రశ్నించారు. అయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మాత్రం ఈ ఘటనపై స్పందించారు. అది రోడ్డు ప్రమాదమేనని, ఈ ప్రమాదంపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని యూపీ పోలీసులు స్పష్టంచేశారు.