ఆదివారం, 12 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By వాసు
Last Updated : మంగళవారం, 21 మే 2019 (17:19 IST)

భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి...?

ఆకలి బాధను తీర్చుకునేందుకు ఎంతటి వారైనా పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని ఆశ్రయించి తీరాల్సిందే. అలాంటి అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది జగమెరిగిన సత్యం. మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి వికసించి విజ్ఞానవంతుడైన తర్వాతనే అన్నానికి ఉన్న విలువని గుర్తించాడు. తన ప్రాథమిక అవసరాలన్నింటిలోకీ ఆహారమే ముఖ్యమైనదని కనుగొన్న మానవుడు ఆ తర్వాత నుంచి దానిపై భక్తిభావం పెంచుకున్నాడు.
 
అయితే, పూర్వకాలంలో భోజనశాలలను ప్రతినిత్యం ఆవుపేడతో అలికి సున్నంతో నాలుగువైపులా గీతలు వేస్తూండేవారు. దీని వలన సూక్ష్మక్రిములు భోజనశాలలోకి ప్రవేశించేవి కావు. మనుషులను అనారోగ్యాలకు గురి చేసే సూక్ష్మక్రిములను చంపే శక్తి ఆవు పేడలోనూ, ఆవు మూత్రంలోనూ ఉంది. 
 
భోజనం చేసిన తర్వాత కిందపడిన ఆహారపదార్థాలను తీసి వేసి మరలా నీటితో అలికి శుభ్ర పరిచేవారు. తద్వారా చీమలు మొదలైన కీటకాలు రాకుండా ఉండేవి. మనకు శక్తిని ప్రసాదించి, మన ప్రాణాలను కాపాడి, మనలను చైతన్య వంతులను చేసి నడిపించే ఆహారాన్ని దైవసమానంగా భావించి గౌరవించి పూజించటంలో తప్పు లేదనేది నిర్వివాదాంశం కదా. 
 
చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది, అదే కాళ్ళు కడుక్కోకపోతే మన ఆరోగ్యంతోపాటు కుటుంబంలోని వారందరి ఆరోగ్యం కూడా చెడిపోతుంది. అందుకే ఎవరైనా బయట నుంచి ఇంట్లోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్లు కడుక్కోవడం కూడా మన ఆచారాలలో ఒకటిగా మారిపోయింది.
 
మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతూ తెలియకుండా అశుద్ధ పదార్థాలను తొక్కుతూ కాళ్లను కడుక్కోకుండా ఇంట్లోకి రావడం వల్ల కుటుంబంలోని అందరికీ కాకపోయినా కనీసం కొందరి ఆరోగ్యాలకైనా హాని కలుగుతుంది. మరీ ముఖ్యంగా పసి బిడ్డలకైతే మరింత హాని కలగజేయవచ్చు. ఇలాంటి ఇబ్బందులన్నింటినీ దృష్టిలో ఉంచుకునే అప్పటి పెద్దవాళ్లు భోజనానికి కూర్చునే ముందు కాళ్లు కడుక్కోవడం ఒక తప్పనిసరి ఆచారంగా మార్చారు.