మంగళవారం, 27 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. ఏది నిజం
  3. కథనం
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (13:16 IST)

ప్రార్థన ఎంతకాలం కొనసాగాలి? దాని పర్యావసానం ఏమిటి !? (video)

ప్రార్థన అంటే స్వార్థంతో మన ఇష్టానికి అనుగుణంగా కాకుండా అంతర్యామిగా ఉన్న ఈశ్వర సంకల్పం మేరకు నడిపించాలని కోరుకోవటం. నిజానికి అలా కోరుకోవటం మనలో శుభేచ్ఛను కలిగించటంకోసమే. శుభేచ్ఛ అంటే ఈశ్వరేచ్ఛ.

అది అర్థమైన తర్వాత ప్రార్థన చేయడానికి కూడా ఏమీ ఉండదు. ఆ స్థితి కలిగేవరకూ ప్రార్థనగా సాగిన భక్తి ఆ తర్వాత ఆరాధనగా పరిణమిస్తుంది. దైవం ఎడల ఆరాధనాభావం వస్తే ఆత్మీయత ఏర్పడుతుంది. అప్పుడు ప్రతీది దైవంతో చెప్పుకోవడమే కానీ అడగటం ఉండదు. అది చిన్న పిల్లవాడు స్కూల్ కి వెళుతూ 'అమ్మ వెళ్ళొస్తానని' చెప్పటం లాంటిది.

అందులో ఏ కోరిక, ప్రార్ధన లేవు. కేవలం ఆత్మీయతే ఉంది. మనకి కూడా భగవంతునితో అలాంటి ఆత్మీయత వస్తే మనకంటూ ప్రత్యేకంగా ఏ సంకల్పం ఉండదు. అదే శరణాగతి. అప్పుడు దైవంతో ఏకాత్మతాభావనే ఉంటుంది.

అందుకు మనం విశుద్ధ మనస్కులం కావాలి. దైవం అందరిలోనూ సమంగానే ఉన్నా, విశుద్ధ మనస్కుల్లో బాగా ప్రస్ఫుటం అవుతుందని భగవాన్ శ్రీరమణమహర్షి బోధించేవారు. అలా ప్రస్ఫుటమవ్వాలని ఎవరూ కోరుకోనక్కర్లేదు. అందుకే మన ప్రార్థనా విధానమంతా ఒక అంతిమ లక్ష్యంతోనే సాగుతుంది !