తిరుమల శ్రీవారి భక్తులపై భానుడి ప్రభావం...
కలియుగ దైవం.. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన హిందూ ధార్మిక ఆలయాల్లో తిరుమల ఒకటి. ప్రతిరోజు 50 నుంచి 70 వేల మందికిపైగా భక్తులు తిరుమలకు వచ్చి పోతుంటారు. తిరుమలకు వెళ్ళాలంటే తిరుపతి వచ్చి భక్తులు తిరుమలకు వెళ్ళాల్సిందే. ప్రతిరోజు వేలాదిగా వచ్చే తిరుమల క్షేత్రానికి ప్రస్తుతం భక్తుల రద్దీ రోజురోజుకు తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం భానుడి ఎఫెక్ట్..
పాఠశాలలకు సెలవులు ప్రకటించారంటే ఇక చెప్పనవసరం లేదు. మొత్తం జనంతో తిరుమల కిక్కిరిసిపోతుంది. ఈనెల 23వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సెలవులు ప్రకటించిన మరుసటి రోజు నుంచే తిరుమల గిరులు ఎప్పుడూ భక్తులతో పోటెత్తి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కారణం భానుడి ప్రతాపం.
తిరుపతిలో రోజురోజుకు పెరిగిపోతున్న ఎండలతో ఈ ప్రాంతానికి రావాలంటేనే భక్తులు భయపడిపోతున్నారు. 40 డిగ్రీల నుంచి ప్రస్తుతం 47 డిగ్రీల ఉష్ణోగ్రత తిరుపతి పట్టణంలో కనిపిస్తోంది. తిరుపతికి రాగానే భక్తులకు ఉక్కపోత. వేడిగాలితో భక్తులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. చిన్నపిల్లలతో వచ్చేవారి పరిస్థితి ఇక అంతే.
పెరిగిపోతున్న ఎండలతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో తిరుమల గిరులు నిర్మానుషంగా మారిపోయాయి. ప్రతిరోజు ఇదే పరిస్థితి కనిపిస్తోంది తిరుమలలో. భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతోంది. తితిదే చరిత్రలోనే సెలవు దినాల్లో భక్తులు లేకుండా పోవడం ఇదే ప్రథమమని చెప్పుకోవచ్చు. ప్రతి సెలవు దినాల్లోను భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడూ తగ్గదు.
తిరుపతి, తిరుమలలో తితిదే భక్తుల కోసం చేసింది శూన్యమే. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు కనీసం చలువ పందిళ్ళయినా అక్కడక్కడ వేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా చలువ పందిళ్లు తితిదే వేయలేదు. తిరుమలలోని కొన్ని ప్రాంతాల్లో జలప్రసాదం పేరుతో నీటిని భక్తులకు సరఫరా చేస్తోంది తప్ప తిరుపతిలో అసలు ఆ పరిస్థితే కనిపించడం లేదు. దీంతో భక్తులు ఎండవేడిమిని తట్టుకునే ధైర్యం లేక తిరుమల రావడం మానేస్తున్నారు. మొత్తం మీద ఎండప్రభావం తిరుమలపై స్పష్టంగా పడినట్లు తెలుస్తోంది.