శ్రీవారి భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త.. ఏంటది..?
శ్రీవారి భక్తులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఓ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుమల తిరుపతికి రిజర్వేషన్ చేయించుకునే సమయంలోనే తిరుమల శ్రీవారి దర్శనం కోసం కూడా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ టిక్కెట్ ధర రూ.300. ఈ టిక్కెట్‌తో శీఘ్రదర్శనం చేసుకోవచ్చు.
తిరుపతికి వెళ్లే దూరప్రాంత సర్వీసులకు ఈ సదుపాయం వర్తిస్తుందని, ప్రయాణ చార్జీతో పాటు రూ.300 అదనంగా చెల్లించి ఉదయం 11 గంటల స్లాట్‌లో, ఆపై సాయంత్రం 4 గంటల స్లాట్‌లో టికెట్లను ఎంచుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద రోజుకు 1000 టిక్కెట్లను జారీచేస్తారు.
ఈ టికెట్లు పొందిన వారికి త్వరితగతిన దర్శనం కల్పించేలా చూడడానికి తిరుమల బస్ స్టేషన్‌లో ఆర్టీసీ సూపర్ వైజర్లను కూడా నియమించింది. కాగా, బెంగళూరు, హైదరాబాద్, పాండిచ్చేరి, విశాఖపట్నం, చెన్నై, కంచి, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పైగా, వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆర్టీసీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.