శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By మనీల
Last Modified: సోమవారం, 30 సెప్టెంబరు 2019 (15:31 IST)

జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..

ప్రేమ అనే రెండక్షరాల మాటకు యువత మధ్య ఎంతటి మద్దతు ఉందో పెద్దవారి వద్ద అంతటి వ్యతిరేకత ఉంది. ప్రేమ పేరుతో తమ పిల్లలు ఎక్కడ జీవితంలో ఎదగకుండా పోతారో, ఎలాంటి వారిని భాగస్వామిగా ఎంచుకుని ఏ కష్టాలు కొని తెచ్చుకుంటారో అని పెద్దవారు మదనపడిపోతుంటారు. 
 
అదే సమయంలో యువత సైతం ప్రేమ విషయానికి వచ్చేసరికి తమను కనిపెంచిన వాళ్ల మాటకన్నా తమ ప్రేమే ముఖ్యం అన్న రీతిలో ప్రవర్తిస్తుంటారు. దీంతో ప్రేమ అనే రెండక్షరాలు అటు కన్నవాళ్లకి ఇటు వారి పిల్లలకు మధ్య పెద్ద అగాధాన్నే సృష్టిస్తుంటుంది. 
 
చదువుకునే వయసులో ప్రేమ పేరుతో ఎక్కడ తమ బిడ్డ పతనమై పోతాడో అని భయపడే పెద్దవాళ్ల మనస్తత్వం, కొత్తగా ఏర్పడిన ప్రేమ బంధం తమ కన్నవాళ్ల వల్ల ఎక్కడ దూరమై పోతుందో అన్న పిల్లల అభిప్రాయం రెండూ ఆలోచించదగ్గ విషయాలే. ఎటొచ్చీ ఎవరి కోణంలో వారు తప్ప మరొకరి కోణంలో ప్రేమ గురించి ఆలోచించకపోవడమే దురదృష్టకరం. 
 
తమ బిడ్డల బాగు కోరుకోవడం పెద్దవాళ్లుగా వారి బాధ్యత. బాధ్యత తీసుకున్నప్పుడు హక్కులు సైతం ఉండాలనుకోవడం సహజం. అందుకే తమ బిడ్డ బాగు కోరి ప్రేమ వద్దని మొదట్లో నచ్చజెప్పే పెద్దవాళ్లు చివరకు బెదిరింపులకు దిగుతుంటారు. అలాగే పిల్లలు సైతం పెద్దవాళ్లపై ఎంతటి ప్రేమ, అభిమానాలున్నా యవ్వనప్రాయంలో తమ మనసు దోచిన వారిని తాము అభిమానించే తల్లితండ్రులే వద్దని చెబుతుంటే దిక్కుతోచని పరిస్థితుల్లో వారిని ఎదిరించడానికి సైతం సిద్ధమౌతుంటారు.