శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 జులై 2021 (17:50 IST)

టోక్యో ఒలింపిక్స్ : ఆస్ట్రేలియా చేతిలో చిత్తాగా ఓడిన భారత్

టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన హాకీ మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. కోటి ఆశలతో బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు రెండో మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 1-7తో చిత్తుగా ఓడింది. 
 
మ్యాచ్ ప్రారంభం అయిందని రిఫరీ విజిల్ వేశాడో లేదో... నిమిషంలోపే గోల్ నమోదు చేసిన ఆస్ట్రేలియన్లు ఆ తర్వాత ఎక్కడా విశ్రమించలేదు. నిరంతరాయంగా భారత గోల్ పోస్టుపై దాడులు నిర్వహిస్తూ గోల్స్ వర్షం కురిపించారు.
 
తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై కోటగోడలా నిలిచిన భారత గోల్ కీపర్ శ్రీజేష్ కంగారూల ముందు తేలిపోయాడు. శ్రీజేష్‌ను నిస్సహాయుడ్ని చేస్తూ ఆసీస్ ఆటగాళ్లు గోల్స్ వేస్తూ పండగ చేసుకున్నారు. 
 
ఆస్ట్రేలియా జట్టులో బ్లేక్ గోవర్స్ రెండు గోల్స్ నమోదు చేయగా, టిమ్ బ్రాండ్, జాషువా బెల్ట్ జ్, డేనియల్ బీలే, ఫ్లిన్ ఓగ్లివీ, జెరెమీ హేవార్డ్ తలా ఒక గోల్ సాధించారు. ఇక భారత జట్టుకు కంటితుడుపుగా దిల్ ప్రీత్ సింగ్ ఓ గోల్ నమోదు చేశాడు.