ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ నుంచి పీవీ సింధు అవుట్
భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించింది. బర్మింగ్‌హామ్‌లోని యుటిలిటా ఎరీనా వేదికగా రౌండ్-16 మ్యాచ్‌లో ఓడిపోయింది.
చైనాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ షట్లర్ అన్‌సే యంగ్ చేతిలో 21-19, 21-11 తేడాతో వరుస సెట్లలో సింధు ఓటమిపాలయ్యింది. 42 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. తొలి సెట్‌లో హోరాహోరీగా తలపడిన సింధు.. రెండవ సెట్‌లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది.
అంతకుముందు రౌండ్-32లో జర్మనీకి చెందిన షట్లర్ వోన్నే లీపై సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే. సింధు ఓటమితో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సింగిల్స్ విభాగంలో ఆశలన్నీ స్టార్ షట్లర్ లక్ష్య సేన్‌పైనే ఉన్నాయి.
మరోవైపు డబుల్స్ విభాగంలో భారత టాప్ జోడీ సాత్విక్ - చిరాగ్ జోడి పురుషుల రౌండ్-16లో ఇండోనేషియా జంట మహమ్మద్ షోహిబుల్ ఫిక్రి-బగాస్ మౌలానాతో తలపడనుంది.