ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:28 IST)

ఒకే అడ్రస్‌పై 37 పాస్‌పోర్టులు

బోధన్‌ పాస్‌పోర్టు కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సై మల్లేష్‌రావు, ఏఎస్సై అనిల్‌కుమార్‌ కూడా ఉన్నట్లు సీపీ తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను సజ్జనార్‌ మీడియాకు వివరించారు. ‘‘బోధన్‌లో 7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు పొందారు. వాటిలో ఒకే చిరునామాతో 37 పాస్‌పోర్టులు తీసుకున్నారు. గతనెల బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు ప్రయాణికుల పాస్‌పోర్టులు అనుమానాస్పదంగా ఉన్నాయని ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు.

వారిని విచారిస్తే నకిలీ పత్రాల ద్వారా పాస్‌పోర్టులు పొందినట్లు గుర్తించాం. తెలంగాణలోని బోధన్ నుంచి దుబాయ్‌కి వెళ్లే క్రమంలో వీరు దొరికిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నీతైదాస్‌ అలియాస్‌ సంజీబ్‌దుట్ట అందరికీ పాస్‌పోర్టులు సమకూర్చినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ వ్యవహారంలో ఇద్దరు పోలీసులు ఎలాంటి పరిశీలన చేయకుండా పాస్‌పోర్టు జారీకి అనుమతిచ్చారు. ప్రధాన నిందితుడు నీతైదాస్‌ ఒక్కో పాస్‌పోర్టు కోసం రూ.10వేలు నుంచి రూ.30వేల వరకు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

పశ్చిమ్‌బెంగాల్‌ నుంచి 60 ఆధార్‌కార్డులు తీసుకున్నట్లు గుర్తించాం. ఇలా అక్రమంగా పాస్‌పోర్టులు పొందిన 72 మందిలో ఇప్పటికే 19మంది దేశం విడిచివెళ్లారు.వీరిలో మిగిలిన వారు ఎక్కడున్నారనే విషయంలో దర్యాప్తు చేస్తున్నాం’’ అని సీపీ వెల్లడించారు.