శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Modified: శనివారం, 14 నవంబరు 2020 (22:54 IST)

మద్యం తాగి వాహన ప్రమాదం చేస్తే కఠిన శిక్ష, పదేళ్ల జైలు లేదా యావజ్జీవం: సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

అతిగా మద్యం తాగి, మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు పాల్పడితే.. ఇకపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుతో సరిపెట్టబోమని, కఠినంగా వ్యవహరిస్తామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. ఇలాంటి వారిపై ఐపీసీ 304-ఎ సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తామని, పదేళ్ల జైలు లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కోర్టుల్లో సాక్ష్యాధారాలను సమర్పిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 
ఇటీవల శంషాబాద్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, మియాపూర్‌ ప్రాంతాలతో పాటు బాహ్యవలయ రహదారులపై మద్యం మత్తులో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. ఈ తరహా ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని, రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ ఈ బృందాలు విధులు నిర్వర్తిస్తాయని తెలిపారు. 
 
మహబూబ్‌నగర్‌, మెదక్‌, సిద్దిపేట, బీదర్‌లతో పాటు హైదరాబాద్‌ శివారుల్లో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌ల్లో మద్యం తాగి మాదాపూర్‌, సైబర్‌ టవర్స్‌, గచ్చిబౌలి ప్రాంతాలకు లాంగ్‌డ్రైవ్‌కు వస్తున్నట్లు గుర్తించామన్నారు. మద్యం మత్తులో వాహనం ఎవరు నడిపినా.. అసలు యజమానిపైనా కేసు నమోదు చేస్తామని సజ్జనార్‌ స్పష్టం చేశారు.