1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (20:18 IST)

నీటి కన్నా మద్యం ఏరులై పారుతోంది: వైయస్ షర్మిల

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం రెండో రోజూ అదే జోరుతో కొనసాగింది. ఉదయం 9.30గంటలకు నక్కలపల్లి గ్రామంలో మొదలైన మహా పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైయస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వృద్ధులు, మహిళలు, రైతులు, కార్మికులను ఆప్యాయంగా పలకరిస్తూ వైయస్ షర్మిల గారు ముందుకు సాగారు. మహిళలు, వృద్ధులు తమ బాధలు చెప్పుకుంటూ కంటతడి పెట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు ఇచ్చారు. 

నక్కలపల్లి నుంచి కేతిరెడ్డిపల్లి, వెంకటాపూర్, కవ్వడిగూడ, మల్కాపురం గ్రామాల మీదుగా ఈ పాదయాత్ర సాగింది. రెండో రోజు మొత్తం 12.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.
 
షర్మిలకి సమస్యలు ఏకరువు పెట్టిన ప్రజలు::
మల్కాపురంలో నిర్వహించిన మాట–ముచ్చట కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కేసీఆర్ పాలనలో తమ బతుకులు బుగ్గిపాలు అయ్యాయని కంటతడి పెట్టారు. ఇండ్లు లేక గుడిసెల్లోనే ఎండకు ఎండుతూ, వానకు నానుతున్నామని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వానలకు ఇండ్లు కూలిపోయినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదన్నారు. భర్త చనిపోయి రెండేండ్లు అవుతున్నా పింఛన్లు రావడం లేదన్నారు. ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేదన్నారు. ఆఫీసర్లు ఏ పనికైనా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అర్ధ ఎకరం భూమి ఉన్నా రేషన్ కార్డు తొలగించారని తెలిపారు. ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకున్నారే తప్ప ఇండ్లు, పింఛన్లు ఇవ్వడం లేదన్నారు.

ఆసుపత్రులకు వెళితే ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారని, ప్రైవేటు హాస్పిటళ్లు లక్షల్లో ఫీజులు గుంజుతున్నాయని పేర్కొన్నారు. ధరణి వెబ్ సైట్ తీసుకొచ్చినా భూముల పంచాయితీలు తెగలేదన్నారు. సర్పంచులకు తమ బాధలు చెబితే పట్టించుకోవడం లేదన్నారు. గ్యాస్, కరెంట్ బిల్లు పెరిగి భారంగా మారాయని ఆవేదన చెందారు.  ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని, ఎక్కడా పని దొరకడం లేదన్నారు.
 
అనంతరం వైయస్ షర్మిల గారు మాట్లాడుతూ...‘‘ మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి నాయకుడు వైయస్ఆర్ గారు. ఐదేండ్లలో ఒక్క పన్ను పెంచకుండా అద్భుతమైన పాలన సాగించారు. రైతులకు రుణమాఫీ చేశారు. పేదింటి బిడ్డలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చి, ఉన్నత చదువులు చదించారు.

వైయస్ఆర్ గారు పేదల గురించి మాత్రమే ఆలోచించి సంక్షేమ పథకాలు అమలు చేశారు. 108, 104 సేవల ద్వారా ఉచిత వైద్యం అందించారు. ఐడేండ్లలో మూడు సార్లు నోటిఫికేషన్లు వేసి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రైవేటు రంగంలోనూ లక్షలాది ఉద్యోగాలు కల్పించారు. వైయస్ఆర్ పాలనలో నిరుద్యోగులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు పెరగలేదు. ప్రాణహిత చేవెళ్ల ద్వారా రంగారెడ్డి జిల్లాకు రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనుకున్నారు.

ఇప్పుడున్న కేసీఆర్ మాత్రం మోసపూరిత హామీలు ఇస్తూ ప్రజలను దగా చేస్తున్నారు. జిల్లాకు కృష్ణా నీళ్లు తెస్తామని చెప్పి మోసం చేశారు. రైతులు ఏ పంట వేయాలో కేసీఆరే డిసైడ్ చేస్తుండు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదు. కేవలం 3లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి, 36లక్షల మందికి ఎగ్గొట్టాడు. కేసీఆర్ ఒక్క మాటా నిలబెట్టుకోలేదు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానన్నడు. మూడెకరాలు భూమి ఇస్తానన్నడు.. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానన్నడు.

ఇలా అందరి చెవుల్లో పూలు పెట్టాడు. రాష్ట్రంలో ఇంగ్లీషు చదువులు లేవు కాని ఇంగ్లీషు మందు మాత్రం దొరుకుతోంది. కేసీఆర్ ను నమ్మి, ముఖ్యమంత్రిని చేస్తే బంగారు తెలంగాణ పేరుతో బారుల తెలంగాణ, బీరుల తెలంగాణ చేశాడు. వైయస్ఆర్ ఉన్నపుడు మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. కేసీఆర్ మాత్రం మహిళలకు కనీసం రుణాలు కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్ పాలనలో పిల్లలు చదువుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే  3,500 స్కూళ్లు బంద్ చేయించాడు.

14 వేల మంది టీచర్లను తొలగించాడు. కష్టం మనది.. దోచుకోవడం కేసీఆర్ కుటుంబానిది. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి కాచుకోమంటున్నాడు. వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. దున్నపోతు మీద వాన పడ్డట్టుగా కేసీఆర్ లో మాత్రం చలనం లేదు. చస్తే చచ్చారులే.. ఉద్యోగాలు అడిగేవారు ఉండరని కేసీఆర్ అనుకుంటున్నాడు. తెలంగాణలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మారాలి. ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజా సమస్యలను ఎత్తిచూపడానికే మేం పాదయాత్ర చేపడుతున్నాం.

ప్రభుత్వం మెడలు వంచేందుకే మా పోరాటం. ఈ రెండేండ్లలో కేసీఆర్ దిగి వచ్చి, ప్రజలకు క్షమాపణ చెప్పి, సమస్యలు పరిష్కరించాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు గట్టి బుద్ధి చెప్పాలి. ప్రజలు పార్టీని ఆశీర్వదిస్తే వైయస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తానని, వైయస్ఆర్ బిడ్డగా మీకు మాట ఇస్తున్నాను. నా బతుకంతా తెలంగాణ ప్రజలకే అంకితం చేస్తా."

చేవెళ్ల నియోజకవర్గం లో ప్రజా ప్రస్థానం యాత్ర రెండో రోజు ముగించుకొని, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోకి ప్రవేశించారు.