మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (13:42 IST)

తెరాసలో పేలేందుకు సిద్ధంగా ఉన్న అణుబాంబు : బండి సంజయ్ జోస్యం

తెలంగాణ రాష్ట్ర సమితిలో ఓ అణుబాంబు పేలేందుకు సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం చెప్పారు. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి, ఆ స్థానంలో తన తనయుడు కేటీఆర్‌ను కూర్చోబెడతాడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే అధికార తెరాస నేతల వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. 
 
ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ, తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ పూజలు చేసి, పూజ సామగ్రిని కాళేశ్వరం వద్ద ఉన్న గోదావరిలో కలిపారన్నారు. 
 
అయితే, కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసిన వెంటనే టీఆర్ఎస్‌లో అణుబాంబు పేలుతుందన్నారు. కేటీఆర్ సీఎం కావడాన్ని టీఆర్ఎస్‌కు చెందిన చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
 
కేటీఆ‌ర్‌ను సీఎం చేస్తున్నట్టు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలకు కూడా చెప్పొచ్చానని, బీజేపీతో స్నేహం ఉంటుందంటూ తనకు అనుకూలమైన వ్యక్తుల చేత కేసీఆర్ చెప్పిస్తున్నాడని విమర్శించారు. ఏ పార్టీ కూడా కేసీఆర్‌తో కాని, టీఆర్ఎస్‌తో కాని పొత్తు పెట్టుకోదనే విషయాన్ని అందరూ గ్రహించాలని చెప్పారు.
 
బీజేపీ, తెరాస రెండూ ఒకటే అని మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెపుతున్నారని... ఇదంతా అబద్ధమన్నారు. ఆయనకు ఒక సవాల్ విసురుతున్నానని... ఇద్దరం కలిసి ఢిల్లీకి వెళ్లి మోడీ, అమిత్ షా, నడ్డాలను కలుద్దామని... ఆ దమ్ము నీకుందా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని దుయ్యబట్టారు.