శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (14:09 IST)

హుజురాబాద్‌ ఆధిక్యం దోబూచులాట : ఈటల వర్సెస్ గెల్లు

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో మళ్లీ ఈటల రాజేందర్ ముందంజలోకి వచ్చేశారు. ఎనిమిదో రౌండ్‌లో వెనుకబడిన ఆయన.. తొమ్మిదో రౌండ్‌లో దూసుకొచ్చేశారు. బీజేపీకి తొమ్మిదో రౌండ్‌లో 1,835 ఓట్ల ఆధిక్యం దక్కింది. 
 
ఈ రౌండ్‌లో బీజేపీకి 5,305 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 3,470 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఇప్పటిదాకా ఈటలకు 40,412 ఓట్లు రాగా.. గెల్లుకు 35,307 ఓట్లు వచ్చాయి. దీంతో ఈటల మెజారిటీ 5,105 ఓట్లకు పెరిగింది.
 
కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్‌ జోరుగా, ప్రశాంతంగా సాగుతోంది. ఈ ఓట్ల లెక్కింపులో తొలిసారి అధికార తెరాస అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చారు. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 162 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆయనకు ఈ రౌండ్‌లో 4,248 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 4,086 ఓట్లు పోలయ్యాయి. 
 
ఇప్పటివరకు వెల్లడైన ఓట్ల లెక్కింపులో మొత్తంగా ఈటల రాజేందర్ 3,270 ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు. ఈటలకు ఎనిమిది రౌండ్లు కలిపి 35,107 ఓట్లు పోలవగా.. గెల్లుకు 31,837 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు కేవలం 1,175 ఓట్లే వచ్చాయి.
 
అయితే, ఎనిమిదో రౌండ్‌లో గెల్లు సొంతూరు హిమ్మత్ నగర్ కూడా ఉండడమూ కలిసి వచ్చిందని చెబుతున్నా.. గెల్లుకు సొంతూరులోనే తక్కువ ఓట్లు పోలుకావడం గమనార్హం. హిమ్మత్ నగర్‌లో బీజేపీకి 540కిపైగా ఓట్లు వస్తే.. గెల్లుకు 300 ప్లస్ ఓట్లు వచ్చాయి. 
 
మరోవైపు మరో 15 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ తప్పేలా లేదు. కాగా, కౌంటింగ్ సిబ్బంది మధ్యాహ్న భోజన విరామం తీసుకున్నారు. దీంతో 9వ రౌండ్ ఫలితాలు కొంచెం ఆలస్యంగా వచ్చే అవకాశాలున్నాయి.