చంద్రబాబుకు గిఫ్టు సిద్ధం చేస్తున్నాం.. కుల రాజకీయాలకు ఆయనే కారణం : తలసాని
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్టు ఇవ్వడం ఖాయమని తెరాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అంతేకాకుండా, ఏపీలో కులరాజకీయాలకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమన్నారు.
ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన యాదవ మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఇందులో తలసాని మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ యాదవ నేతలు రాజకీయంగా ఎదుగాలని ఆకాంక్షించారు.
ఏపీ ప్రజలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. తెరాస కాదు, ఏపీ ప్రజలే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ఏపీలో కుల రాజకీయాలకు కారణం చంద్రబాబేనని ఆరోపించారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, ఏపీలో కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలోని యాదవులకే కాదు.. బీసీలకూ నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.