బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 జనవరి 2021 (09:05 IST)

తెలంగాణాలో కరోనా టీకాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

ఈ నెల 16వ తేదీ నుంది దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ టీకాల వినియోగం ప్రారంభంకానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో శ్రీకారం చుట్టనున్నారు. 
 
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. టీకా పంపిణీ కోసం తెలంగాణలో తొలి రోజున 139 కేంద్రాలను ఎంపిక చేశారు. వీటిలో 40 ప్రైవేటు, 99 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. 
 
హైదరాబాద్‌లో 13, మేడ్చల్‌లో 11, రంగారెడ్డిలో 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న 16న ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి, రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని పీహెచ్‌సీ వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు.
 
ఇకపోతే, 17న టీకా పంపిణీకి సెలవు కాగా, 18న తిరిగి ప్రక్రియ మొదలవుతుంది. ఆ రోజు నుంచి పంపిణీ కేంద్రాలను పెంచనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1200 ఆసుపత్రులలో 1400 కేంద్రాల ద్వారా టీకాలు వేస్తారు. గాంధీ, ఉస్మానియా, వరంగల్‌లోని ఎంజీఎం వంటి పెద్దాసుపత్రులలో నాలుగు కేంద్రాలను పెంచనున్నారు. 
 
ప్రైవేటు ఆసుపత్రులలో 170 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడతారు. 500 మందికిపైగా సిబ్బంది ఉన్న ప్రైవేటు ఆసుపత్రులలో టీకా కేంద్రాల సంఖ్యను పెంచనుండగా, 100 మందికిపైగా సిబ్బంది ఉన్న కేంద్రాల్లో టీకా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
 
మరోవైపు, రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతున్నది. శనివారం తెలంగాణలో 97.81శాతానికి చేరుకోగా, జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.4 శాతం ఉన్నది. ఒక్కరోజే 37 వేల పరీక్షలు నిర్వహించారు. 
 
351 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 65, రంగారెడ్డి జిల్లాలో 30, మేడ్చల్‌లో 28 కేసులు వెలుగుచూశాయి.