హరీష్ రావుపై ఈటెల వ్యాఖ్యలు.. నాకు పట్టిన గతే నీకూ కూడా..?
టీఆర్ఎస్ నేతలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో తనపై అవాకులు చెవాకులు మాట్లాడిస్తున్నారని ఈటల అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని విమర్శించారు.
తాను వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు, తనపై కేసీఆర్ కుట్రలు చేశాడని ఆరోపించారు. వారి అబద్ధాల పత్రిక, ఛానల్‌లో పదేపదే చూపించారని అన్నారు. ఆ వార్తలు చూసిన ప్రతి తెలంగాణ బిడ్డ కన్నీరు పెట్టారని పేర్కొన్నారు. తన నియోజకవర్గం వారికి హరీష్ దావత్, డబ్బు ఇస్తున్నారని ఆరోపించారు.
మెప్పుపొందాలనే హరీష్‌రావు చూస్తున్నాడని, హరీష్‌రావుకు తన గతే పడుతుందన్నారు. మీ పార్టీలో గెలిచా అన్నారుగా.. అందుకే రాజీనామా చేశానని చెప్పారు. డబ్బు, ప్రలోభాలను పాతరేసే సత్తా హుజురాబాద్ ప్రజలకుందన్నారు.
తమతో తిరిగే యువకుల్ని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అందరినీ బెదిరించి టీఆర్‌ఎస్ కండువాలు కప్పుతున్నారని ఈటల ఆరోపించారు. సీఎస్, డీజీపీ చట్టానికి లోబడి పనిచేయాలి.. చుట్టంగా కాదన్నారు.