గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (14:35 IST)

సీఎం కేసీఆర్‌కు లేఖాస్త్రం సంధించిన ఈటల

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ మంత్రి, తెరాస మాజీ నేత ఈటల రాజేందర్ వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ఓ లేఖను సంధించారు. ఇందులో వివిధ అంశాలను లేవనెత్తారు. ముఖ్యంగా, తాను రాజీనామా చేసిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలను ఆత్మగౌరవానికి ప్రతీకగా పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, ఈటల రాజేందర్‌ లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ఈటలది న్యాయ పోరాటమని, దానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. గురువారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఈటల రాజేందర్‌ అని, అలాంటి మనిషి ప్రజలను, ప్రభుత్వాన్ని మోసం చేశారంటే ఎవరు నమ్మరని అన్నారు. 
 
అసైన్డ్‌ భూములు కబ్జా చేశారని ఆయనను బయటకు పంపారని, అదే టీఆర్‌ఎ్‌సలో భూ కబ్జాలు చేసినవారు చాలా మంది ఉన్నారని జితేందర్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు ఏక పక్షంగా ఉంటాయని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఉప ఎన్నిక అనగానే నియోజకవర్గాలకు వచ్చి పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నారని.. అదే మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. 
 
హుజూరాబాద్‌లో మిషన్‌ కాకతీయ పనుల బిల్లులు రెండేళ్లుగా ఇవ్వలేదని, ఇప్పుడు ఎన్నికలనగానే ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రతిపక్షం బలంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు వ్యాఖ్యానించారు.