గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం

ఆర్టీసీ సమ్మె సమస్య పరిష్కరించండి: హైకోర్టు

ఆర్టీసీ సమ్మె - విచారణ 11కి వాయిదా.! ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణ ముగిసింది. ప్రభుత్వం ఇచ్చిన​ నివేదికలోని అంకెలు, లెక్కలు తప్పు చూపించారని ఐఏఎస్​లపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు తెలివిగా సమాధానం చెబుతున్నారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణకు సీఎస్‌ జోషి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్ శర్మ హాజరయ్యారు. అధికారుల నివేదికలపై స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది.

ఆర్థికశాఖ సమర్పించిన రెండు నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కింద వస్తుందని తెలుసా ?అని ప్రశ్నించింది. ఐఏఎస్‌ అధికారుల నివేదికలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

కోర్టును క్షమాపణ కోరిన ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇస్తున్నట్టు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు. మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా? అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు స్వయంగా వివరణ ఇచ్చారు.

సమయాభావం వల్ల రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు...మన్నించాలని రామకృష్ణారావు కోర్టును కోరారు. అయితే దీనిపై క్షమాపణ కోరడం సమాధానం కాదని, వాస్తవాలు చెప్పాలని ఘాటుగా వ్యాఖ్యానించింది.

నివేదికలోని అంకెలు, లెక్కలపై మరోసారి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆర్టీసీ, ఆర్థికశాఖ నివేదికల్లోని అంకెలు వేర్వేరుగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. మేం వేటిని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. తప్పుదోవ పట్టించేందుకు తెలివిగా గజిబిజి లెక్కలు, పదాలు వాడారని ధర్మాసనం వెల్లడించింది.

ఉద్దేశపూర్వకంగానే అధికారులు తప్పుదోవ పట్టించినట్లు అర్థమవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ విషయం ఆర్టీసీ ఎండీ నివేదికలో అంగీకరించడం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. ప్రభుత్వాన్ని, సీఎంను, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆక్షేపించింది.