మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (14:22 IST)

టీఆర్ఎస్ పార్టీలోకి పెద్దిరెడ్డి: ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

peddireddy
టీఆర్ఎస్ పార్టీలోకి మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి చేరనున్నారు. తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. తన అనుచరులు, కార్యకర్తలు, నాయకులతో సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు పెద్దిరెడ్డి ఇప్పటికే తెలిపారు. 
 
కేసీఆర్‌ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు పెద్దిరెడ్డి. హుజూరాబాద్‌లో ఈటలకు బీజేపీ అధిష్ఠానం అధిక ప్రాధాన్యమివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు.
 
దళితుల భూములను అక్రమంగా కాజేసిన ఈటలను పార్టీలో చేర్చుకోవద్దని చెప్పినా బీజేపీ అధిష్ఠానం పెడచెవిన పెట్టడం, తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 
 
కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 1994, 1999లో … టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు పెద్దిరెడ్డి. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో బీజేపీలో చేరారు. తర్వాతి పరిణామాలతో రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.
 
ఇకపోతే.. మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. శనివారం టీఆర్ఎస్‌లో చేరబోతున్నానని పెద్దిరెడ్డి ప్రకటించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో రేపు (శనివారం) టీఆర్ఎస్‌లో చేరుతానని చెప్పారు. కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి బాధ్యతలను అప్పగించినా శిరసా వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
 
 దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో బీజేపీ ఇన్ఛార్జీగా పని చేశానని... అయినా హుజూరాబాద్ లో తనను ఇన్ఛార్జీగా నియమించలేదని విమర్శించారు. తనకు చెప్పకుండానే ఈటలను బీజేపీలో చేర్చుకున్నారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ దేవాలయ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలు నిజమని కోర్టులో తేలితే... బీజేపీ ఏం సమాధానం చెపుతుందని ప్రశ్నించారు.