గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 డిశెంబరు 2022 (12:35 IST)

తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం.. సీనియర్ నేతల తిరుగుబాటు

bhatti vikramarka
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోమారు సంక్షోభం తలెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రకటించిన పీసీసీ కమిటీలపై పలువురు సీనియర్లు బాహాటంగానే తమ అక్కుసు వెళ్లగక్కుతున్నారు. పనిలోపనిగా సీనియర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్ నేతలంతా సమావేశమయ్యారు. ఇందులో పార్టీలో సీనియర్లుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ గౌడ్, దామోదర రాజనర్సింహా తదితరులు పాల్గొన్నారు.  
 
ఇటీవల ప్రకటించిన పీసీసీ కమిటీల్లో 108 మందికి స్థానం కల్పించారు. అందులో సగం మంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవారేనని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా, తమదే అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ అంటూ వారు ఆరోపిస్తున్నారు. వలస నేతలు, టీడీపీ నేతలు అంటూ రేవంత్ రెడ్డి తదితరులను ఉద్దేశించి సీనియర్ నేతలు ఆరోపణలు గుప్పించారు. 
 
పార్టీలోని సీనియర్ నేతలు విస్మరించి టీడీపీ నుంచి వచ్చిన తన వారికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నది సీనియర్ నేతల ప్రధాన ఆరోపణగా ఉంది. పైగా, పార్టీ కోసం శ్రమిస్తున్న తమపై కోవర్టులనే ముద్ర వేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ అంశాలన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళతామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడమే తమ ఏకైక లక్ష్యమని వారు ప్రకటించారు.