శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (17:19 IST)

తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి భిక్ష కాదు : కె.కవిత

తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క భిక్ష కాదని, ప్రజా పోరాటానికి లభించిన విజయమని తెరాస ఎమ్మెల్సీ కె.కవిత అన్నారు. ఇటీవల మాజీ ప్రధాని, ఆయన కుటుంబంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆ తర్వాత బీజేపీ - తెరాస నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. 
 
ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు కె.కవిత కౌంటరిచ్చారు. నాటి ఉద్యమ నాయకులు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదు అని ఆమె వ్యాఖ్యానించారు. 
 
అహింసా మార్గంలో తెరాస పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలిసి రావడం, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మీపై ఒత్తిడి పెరగడం వల్ల తెలంగాణ ఇచ్చారు కానీ అది ఎవరి భిక్షకాదని కవిత అన్నారు. దేశ మాజీ ప్రధానిని, ఆయన కుటుంబాన్ని అవమానకరంగా మాట్లాడుతుంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అండగా సీఎం కేసీఆర్ నిలబడ్డారని, అది కేసీఆర్ స్థాయి, గొప్పతనం. దయచేసి ఇంకోసారి కేసీఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్య చేసే ముందు ఆలోచించుకోవాలని ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు.