ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (08:58 IST)

ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు దళితులు గుర్తుకు వస్తారు: వి.హనుమంతరావు

ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు దళితులు గుర్తుకు వస్తారని  రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. హుజూరాబాద్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే విజయ రమణరావు, అభ్యర్ధి బల్మూరి వెంకటనర్సింగరావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్‌ మరిచిపోయారన్నారు. అన్ని కులాల్లోని పేదలకు పది లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డి కారు బతుకమ్మలపై నుంచి పోనివ్వడం చూస్తే ఎంత అరాచక పాలన నడుస్తుందో ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద ప్రజలకు భూమి, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసిందో చెప్పాలన్నారు.

నల్ల చట్టాలను రద్దు చేయాలని ధర్నా చేస్తున్న రైతుల మీద నుంచి కేంద్ర మంత్రి కుమారుడు కారు పోనిచ్చి నలుగురు ప్రాణాలు బలికొన్నాడన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియాగాంధీ కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటానని కేసిఆర్‌ చేసిన వాఖ్యలను ఆయన గుర్తు చేశారు.

బీజేపీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తూ రిజర్వేషన్లు లేకుండా చేస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతమ్‌, వార్డు కౌన్సిలర్‌ సాయిని రమ, నాయకులు సాయిని రవి, ఎండీ సజ్జు, గాజుల సాగర్‌, శ్యామ్‌, సన్ని పాల్గొన్నారు.