శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (11:41 IST)

#RRR అంటే "రాష్ట్ర రోడ్డు రవాణా" - టీఎస్ ఎండీ సజ్జనార్ క్రియేటివిటీ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీసీ సజ్జనార్ తనదైనశైలిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సు సేవలను ప్రజలు చెంతకు చేర్చేందుకు అనేక రకాలైన ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ప్రయాణికులు కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. 
 
మరోవైపు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అదేసమయంలో ఆర్టీసీ సేవల గురించి తనదైనశైలిలో వివరిస్తున్నారు. ఇందుకోసం "ఆర్ఆర్ఆర్" సినిమా టైటిల్‌ను కూడా వాడేశారు. తన క్రియేటివిటీతో ఆర్ఆర్ఆర్‌కు కొత్త అర్థం చెప్పారు. ఆర్ఆర్ఆర్‌ను "రాష్ట్ర రోడ్డు రవాణా"గా మార్చేశారు. "ఆర్టీసీలో ప్రయాణించండి.. సురక్షితంగా గమ్యాన్ని చేరండి" అంటూ ఉపశీర్షిక పెట్టారు. 
 
పైగా, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, ఇటీవల విడుదలైన "నెత్తురు మరిగితే ఎత్తర జెండా" అనే పాటను కూడా ఆర్టీసీ ప్రచారానికి వినియోగించారు. ఆ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పట్టుకున్న జెండాపై వందేమాతరం అని ఉండగా సజ్జనార్ మాత్రం వాటి స్థానంలో టీఎస్ఆర్‌టీసీ అని రాయడంతో పాటు దాని కింద బస్సు, లోగో వచ్చేలా డిజైన్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు సజ్జనార్ క్రియేటివిటీకీ ఫిదా అవుతున్నారు.