సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2024 (17:37 IST)

కెప్టెన్ సమాధి వద్ద బోరున విలపించిన కోలీవుడ్ హీరో!!

surya emotional
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ హీరో కెప్టెన్ విజయకాంత్ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందారు. ఆయన అంత్యక్రియల సమయంలో అనేక మంది కోలీవుడ్ హీరోలు చెన్నై నగరంలో లేరు. తమతమ వ్యక్తిగత పనులు, చిత్రాల షూటింగుల కారణంగా విదేశాలకు వెళ్లారు. వీరంతా చెన్నైకు తిరిగి వచ్చిన తర్వాత నేరుగా కెప్టెన్ విజయకాంత్ సమాధి వద్దకు వెళ్లి అంజలి ఘటిస్తున్నారు. ఈ క్రమంలో హీరో సూర్య కూడా విదేశాల నుంచి తిరిగి వచ్చి నేరుగా కెప్టెన్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయకాంత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. 
 
విజయకాంత్ మరణం తనకు ఎంతో షాక్‌కు గురిచేసిందన్నారు. కెరీర్ ఆరంభంలో నాలుగు సినిమాల్లో నటించినప్పటికీ తనకు గుర్తింపు రాలేదన్నారు. ఆ సమయంలో "పెరియన్నా" చిత్రంలో విజయకాంత్‌తో కలిసి పని చేశారని తెలిపారు. డ్యాన్స్, ఫైట్స్ బాగా చేయాలని ఆయన తనను ప్రోత్సహించేవారని చెప్పారు. 
 
అందరితో ఎంతో మంచిగా మాట్లాడేవారని, ఆయన మరణం చిత్ర సీమకు తీరని లోటని హీరో సూర్య అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత తన తండ్రి, నటుడు శివకుమార్, తమ్ముడు, హీరో కార్తీతో కలిసి చెన్నై సాలిగ్రామంలోని విజయకాంత్ నివాసానికి వెళ్లి... కెప్టెన్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆ తర్వాత కెప్టెన్ సతీమణి ప్రేమలత, ఇద్దరు కుమారులను ఓదార్చారు.