ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 అక్టోబరు 2021 (16:05 IST)

కన్నడ పవర్ స్టార్ పునీత్ ఇకలేరు.. తీవ్ర విషాదంలో శాండల్‌వుడ్

కన్నడ చిత్రపరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందారు. శుక్రవారం ఉదయం తీవ్ర గుండెపోటుకుగురైన పునీత్ రాజ్ కుమార్ బెంగళూరు విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనను బతికించేందుకు వైద్యులు అత్యంత తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది.
 
శుక్రవారం ఉదయం ఆయన జిమ్‌లో కుప్పకూలిపోగా, ఆసుపత్రికి తరలించిన సమయంలోనే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పునీత్ రాజ్ కుమార్ మృతితో కర్ణాటక వ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. 
 
పునీత్ చికిత్స పొందిన విక్రమ్ ఆసుపత్రి ఎదుట అభిమానులు గుండెలు బాదుకుంటూ భోరున విలపిస్తుండడం మీడియాలో కనిపించింది. పునీత్ కుటుంబసభ్యుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. వారు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు.
 
దిగ్గజ నటుడు రాజ్ కుమార్ మూడో తనయుడైన పునీత్ రాజ్ కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్‌గా గుర్తింపు పొందారు. ఫిట్నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చే పునీత్ గుండెపోటుకు గురికావడం విధి రాత అనుకోవాలి. 
 
పునీత్‌ను అభిమానులు ముద్దుగా అప్పు అని పిలుచుకుంటారు. బాలనటుడిగా ప్రస్థానం ఆరంభించిన పునీత్ రాజ్ కుమార్ 1985లో వచ్చిన 'బెట్టాడ హూవు' చిత్రానికిగాను చైల్డ్ ఆర్టిస్టుగా జాతీయ అవార్డు అందుకున్నారు.
 
హీరోగా తన కెరీర్లో 29కి పైగా చిత్రాల్లో నటించారు. 2002లో వచ్చిన అప్పు చిత్రం హీరోగా పునీత్‌కు తొలి చిత్రం. అభి, వీర కన్నడిగ, అజయ్, హుదుగారు, అంజనీపుత్ర, రామ్, అరసు చిత్రాలు పునీత్ కెరీర్లో భారీ హిట్లు. పునీత్ చివరిగా నటించిన చిత్రం యువరత్న. ఇది ఈ ఏడాది ఆరంభంలో రిలీజైంది. పునీత్ రాజ్ కుమార్‌కు 1999లో అశ్విని రేవంత్ తో వివాహం జరిగింది. వీరికి ధృతి, వందన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందడం దక్షిణాది చిత్ర పరిశ్రమలను తీవ్ర విషాదానికి గురిచేసింది. టాలీవుడ్ అగ్రనటులు చిరంజీవి, మహేశ్ బాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. పునీత్ రాజ్ కుమార్ మరణం అత్యంత బాధాకరమని, తీవ్ర వేదనతో హృదయం ముక్కలైందని చిరంజీవి పేర్కొన్నారు. 
 
పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని, అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు. కన్నడ చిత్ర పరిశ్రమే కాకుండా, యావత్ భారత చిత్ర రంగానికి పునీత్ మరణం పెద్ద లోటు అని పేర్కొన్నారు. పునీత్ కుటుంబానికి, బంధుమిత్రులకు, అభిమానులకు ధైర్యం చేకూరాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
 
మహేశ్ బాబు స్పందిస్తూ.... పునీత్ రాజ్ కుమార్ ఇక లేరన్న విషాదవార్త చూసి షాక్ కు గురయ్యానని, తీవ్ర విచారం కలుగుతోందని పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు కలిసి, మాట్లాడిన వారిలో అత్యంత వినమ్రుడైన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ అని వివరించారు. పునీత్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.