మహిళా ప్రధాన ఇతివృత్తాలు, ప్రయోగాత్మక కథాంశాలతో దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ నయనతార. ఎంచుకునే ప్రతి సినిమాలో కథ, పాత్రల పరంగా వైవిధ్యత కనబరుస్తూ తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆలరిస్తూ ముందుకుసాగుతోంది. ఆమె తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘ఐరా’.
నలుపు వర్ణ శరీరంతో డీ గ్లామర్‌లుక్‌తో కనిపించి ప్రచార చిత్రాలతోనే ఈ సినిమా పట్ల అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఐరా చిత్రంతో కొత్త ప్రయోగం చేసిన నయనతారకు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందించిందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..
యమున(నయనతార) ఓ పత్రికలో కాలమిస్ట్‌గా పనిచేస్తుంటుంది. పెళ్లంటే ఆమెకు ఇష్టం ఉండదు. యమున తల్లిదండ్రులు ఓ అమెరికా యువకుడితో ఆమె పెళ్లిని నిశ్చయిస్తారు. ఆ పెళ్లి నుండి తప్పించుకోవడానికి తన అమ్మమ్మ ఉండే పల్లెటూరికి పారిపోతుంది. జీవితంలో సవాళ్లను ఇష్టపడే యమున ఓ యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసి దయ్యాలను తాను ప్రత్యక్షంగా చూశానంటూ కొన్ని వీడియోలను పల్లెటూరి నుండే పోస్ట్ చేస్తుంటుంది.
వాటి ద్వారా ఆమె పేరు అందరికి తెలిసిపోతుంది. అనూహ్యంగా ఓ నిజమైన ఆత్మ యమునను చంపడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ ప్రమాదంలో యుమున అమ్మమ్మ కన్నుమూస్తుంది. మరోవైపు వైజాగ్‌లో వరుసగా కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోతుంటారు. ఈ హత్యల వెనకున్న కారణాలేమిటన్నది పోలీసులకు అంతుపట్టదు.
భవానీ(నయనతార) అనే యువతి ఆత్మగా మారి ఈ హత్యలను చేస్తుంటుంది. యమునను కూడా భవానీనే చంపడానికి ప్రయత్నిస్తుంటుంది. భవానీ ఎవరు? ఆమె ఎలా చనిపోయింది? ఆమె మరణానికి యమునతో పాటు మరికొందరు ఎలా కారణమయ్యారు? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
ఈ చిత్రం పూర్తిగా ప్రతీకారంతో ముడిపడింది. తన కలల్ని భగ్నం చేసిన వారిపై ఆత్మ పగ పట్టి హతమార్చడమనే పాయింట్‌తో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి వేలాది హారర్ సినిమాలు వచ్చాయి. ఇదే పాయింట్‌కు మానవీయ విలువల్ని జోడించి దర్శకుడు సర్జున్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కురూపిగా, నష్టజాతకురాలిగా సమాజం చేత ఛీత్కారాలు ఎదుర్కొంటున్న ఓ పల్లెటూరి యువతికి, ఆమె రూపురేఖలతోనే ఉన్న పట్టణానికి చెందిన ఆధునిక యువతికి మధ్య సంబంధాన్ని ఆవిష్కరిస్తూ కథను రాసుకున్నారు. అయితే కథకు కీలకమైన మలుపు విషయంలో మాత్రం కొత్తగా ఆలోచించకపోవడంతో ఐరా ఉత్కంఠగా ప్రారంభమై రొటీన్‌గా ముగుస్తుంది.
ప్రథమార్థం మొత్తం టైమ్‌పాస్‌గానే సాగితే, నయనతార, యోగిబాబు, బామ్మ పాత్రలు చేసిన తమిళ కామెడీ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టమే. దయ్యాలు ఉన్నాయంటూ వింత వింత వేషాలు వేసుకుంటూ చేసే హడావిడి కథకు సంబంధం లేకుండా సాగుతుంది. ఈ సన్నివేశాలతో పాటు సిటీలో హత్యల వ్యవహారం గజిబిజిగా ఉంటుంది.
ఇకపోతే, ద్వితీయార్థంలోనే అసలు కథలోకి అడుగుపెట్టిన దర్శకుడు ఒక్కో చిక్కుముడి విప్పుతూ పోయారు. యమునను భవానీ ఆత్మ చంపడానికి గల కారణాలు మరి సింపుల్‌గా ఉంటాయి. వాటిలో ఎమోషన్ సరిగా పండలేదు. భవానీ, అభినవ్‌ల ప్రేమాయణం హృద్యంగా సాగుతుంది. ఆ ఎపిసోడ్ నిడివి తక్కువే అయినా అదే సినిమాను నిలబెట్టింది. అందవిహీనంగా ఉండే వారి పట్ల సమాజంలో చిన్నచూపును భావోద్వేగభరితంగా చూపించారు.
నయనతార ఈ చిత్రంలో భవానీ, యమున అనే రెండు పాత్రల్లో చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది. భవానీ పాత్ర నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో ఆమె నటన మనసుల్ని కదలిస్తుంది. నలుపు శరీర వర్ణంతో సాగే ఈ డీ గ్లామర్ పాత్రకు తన అనుభవాన్ని అంతా రంగరించి ప్రాణప్రతిష్ట చేసింది. కథకుడిగా ప్రతిభను చాటుకున్న సర్జున్ దర్శకుడిగా మాత్రం తేలిపోయారు. సుందరమూర్తి నేపథ్య సంగీతం బాగుంది. భావోద్వేగభరితంగా సాగే రొటీన్ హారర్ థ్రిల్లర్ సినిమా ఇది.