శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2019 (17:27 IST)

భూమిని ఫోటో తీసిన చంద్రయాన్-2... షేర్ చేసిన ఇస్రో

ఇటీవల భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జాబిల్లిపైకి చంద్రయాన్-2 పేరుతో ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. చంద్రయాన్-2 మిషన్ పేరుతో ఈ శాటిలైట్‌ను గత నెల 22వ తేదీన చంద్రమండలంపైకి పంపించారు. అయితే, శుక్రవారం మధ్యాహ్నం 3.27 గంటలకు ఆర్బిట‌ర్‌లోని ఇంధనాన్ని 646 సెకండ్ల పాటు మండించి నాలుగోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. ప్రస్తుతం చంద్రయాన్‌-2 మిషన్‌ ప్రయాణం సాఫీగా సాగుతున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.
 
ఇదిలావుంటే, శుక్రవారం నాలుగోసారి భూమికి దగ్గరగా ఉన్న 270 కిలోమీటర్ల దూరాన్ని.. 277 కిలోమీటర్లకు, భూమికి దూరంగా ఉన్న 71,792 కిలోమీటర్ల దూరాన్ని 89,472 కిలోమీటర్ల దూరానికి విజయవంతంగా పెంచారు. మళ్లీ ఈ నెల 6న ఐదోసారి కక్ష్యదూరం పెంచే ఆపరేషన్‌ను చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నారు.
 
తర్వాత ఈ నెల 14వ తేదీన చివరిగా చంద్రయాన్-2 మిషన్‌ను భూ మధ్యంతర కక్ష్య నుంచి ఒకేసారి చంద్రుడి కక్ష్యలోకి పంపే ప్రక్రియను కూడా చేపట్టనున్నారు. ఇందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చంద్రయాన్-2 మిషన్‌ గమనాన్ని నిశితంగా పరీక్షిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో చంద్రయాన్-2లోని ఎల్ఐ4 కెమెరా తీసిన భూగ్రహం ఫొటోలను ఇస్రో ఆదివారం (ఆగస్టు మూడో తేదీ) విడుదల చేసింది. నీలిరంగులో భూమి మెరిసిపోతుంది. ఈ ఫోటోలను ట్విట్టర్‌లో ఇస్రో షేర్ చేయగా, ఇవి వైరల్ అయ్యాయి. మొత్తం నాలుగు ఫోటోలను చంద్రయాన్-2 మిషన్‌కు అమర్చిన ఎల్ఐ4 కెమెరా తీయగా, వాటిని శాస్త్రవేత్తలు షేర్ చేశారు.