శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : మంగళవారం, 20 నవంబరు 2018 (13:39 IST)

పొడిబారిన చర్మానికి ఇలా చేస్తే..?

చలికాలంలో చర్మం రక్షణ కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా చర్మం తెల్ల తెల్లగా పొడిబారుతుంది. ఈ సమస్య వలన చర్మం దురదలుగా ఉంటుంది. దాంతో రకరకాల ఇన్‌ఫెక్షన్స్ ఏర్పడే అవకాశాలున్నాయి. ఇలాంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుందని ఆలోచిస్తున్నారా.. ఇంట్లోని సహజసిద్ధమైన పదార్థాలతో చర్మ అందం ఎలా పొందాలో చూద్దాం..
 
ఈ చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ సీజన్ వేరియేషన్ వలన మంచినీళ్లు ఎక్కువగా తాగాలనిపించదు. గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరం నుండి నీరు బయటకు వెళ్లే శాతం కాస్త ఎక్కువగానే ఉంటుంది. తద్వారా చర్మం తేమదనాన్ని కోల్పోతుంది. దాంతో చర్మం మరింత ఎక్కువగా పొడిబారుతుంది. అందువలన వీలైనంత వరకు నీరు అధిక మోతాదులో తీసుకావలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇంకా చెప్పాలంటే.. చేతులు, కాళ్లకు పగుళ్లు ఎక్కువైపోతాయి. కనుక సబ్బుకు బదులు గ్లిజరిన్ సబ్బులు వాడడం మంచిది. అలానే రాత్రి పడుకునే ముందుగా చేతులకు, కాళ్లకు మాయిశ్చరైజర్ క్రీమ్స్ రాసుకుంటే ఫలితం ఉంటుంది. ఇలా చేసినా కూడా పగుళ్లు తగ్గలేదంటే.. అప్పుడప్పుడు కొబ్బరి నూనెను రాసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
పొడిబారిన చర్మానికి సున్నిపిండితో కొద్దిగా నువ్వుల నూనె కలిపి స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. వారానికోసారి నువ్వుల నూనెను చర్మానికి రాసుకుని గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా తరచుగా చేయడం వలన శరీరంపై గల మృతుకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా, తాజాగా మారుతుంది. మాయిశ్చరైజర్‌కి బదులుగా స్నానపు నీటిలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి ఆ నీటిని గోరువెచ్చగా చేసి స్నానం చేస్తే చర్మ దురదలు, ఇన్‌ఫెక్షన్స్ తొలగిపోతాయి.