శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 30 అక్టోబరు 2021 (10:13 IST)

శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం... రెండు రోజుల వర్ష సూచన

ఆకాశం మేఘావృతం అవుతోంది.... ముసురు ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇదంతా చూస్తూ, మ‌రోసారి వ‌ర్షం త‌ప్ప‌ద‌న్న‌ట్లుంది వాతావ‌ర‌ణం. నిజ‌మే, వ‌చ్చే రెండు రోజులు ఇలాగే ముసురుగా ఉంటుంద‌ని చెపుతున్నారు... వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు. 
 
నైరుతి బంగాళాఖాతం, దాని దగ్గరగా ఉండే తమిళనాడు, శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే మూడు రోజుల్లో ఇది పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, తూర్పు గాలులతో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా వెల్లడించారు. 
 
వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. వ‌ర్ష సూచ‌న‌లు వ‌చ్చే రెండు రోజుల‌పాటు ఉండ‌టంతో ప్ర‌జ‌లు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాల‌ని కోరుతున్నారు. రైతుల‌కు కూడా ఈ వ‌ర్ష సూచ‌న వ‌ర్తిస్తుంద‌ని పేర్కొంటున్నారు.