ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (13:03 IST)

నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం : ఆ అంశంపైనే కీలక చర్చ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. అదే రోజు ఉదయం ఏపీ మంత్రి మండలి సమావేశం జరుగనుంది. ఇందులో బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలన్న అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలా వద్దా అనే అంశంపై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం బుధవారం జరుగనుంది. 
 
ఇందులో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై పొలిట్‌బ్యూరో సభ్యులు సమీక్ష చేయనున్నారు. అలాగే, ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నిర్వహణపై కూడా చర్చించనున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో వైకాపా సభ్యులు అసభ్య ప్రవర్తనతో తీవ్రంగా కలత చెందిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ సభలో మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని శపథం చేసి సభ నుంచి వెళ్ళిపోయిన విషయం తెల్సిందే. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు దూరంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి.