శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (10:14 IST)

విక్రమ్ జాడ కనిపెట్టొచ్చు.. కేసీఆర్ మాటలగారడీని గుర్తించలేం : విజయశాంతి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి తనదైనశైలిలో స్పందించారు. చంద్రయాన్-2 మిషన్‌లో చివరి క్షణంలో గల్లంతైన విక్రమ్ ల్యాండర్ జాడ కనుక్కోవచ్చేమో కానీ, తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో వాస్తవాలు కనుక్కోవడం ఎవరితరం కాదని సెటైర్లు వేశారు. 
 
ఈ బడ్జెట్‌పై ఆమె స్పందిస్తూ, గత యేడాది లక్షన్నర కోట్ల రూపాయలకుపైగా బడ్జెట్ తీసుకువచ్చారని, కానీ అక్షరాస్యత విషయంలో తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే అట్టడుగున ఉందని తేలిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సదుపాయాలు లేకపోవడం, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వంటి నిర్లక్ష్యపూరిత వ్యవహారశైలితో పేద రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆమె మండిపడ్డారు. 
 
ఆఖరికి రైతులకు యూరియా అందించే విషయంలోనూ కేసీఆర్ సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. గత బడ్జెట్ లెక్కలు తేలకముందే కొత్త బడ్జెట్‌తో కేసీఆర్ గారడీ మొదలుపెట్టారన్నారు. అయితే గత బడ్జెట్ విషయంలో అవకతవకలపై బీజేపీ నేతలు నిగ్గుతేల్చేందుకు సిద్ధమైనట్టు వారి మాటల ద్వారా అర్థమవుతోందని విమర్శించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు గతంలో కేటాయించిన నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.