1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (06:51 IST)

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : ఎనిమిది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

tammineni sitharam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై ఆయన అనర్హత వేటు వేశారు. 
 
ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని ఇటు అధికార, అటు విపక్ష పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీరిలో వైకాపాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు ఉన్నారు. టీడీపీ తరపున కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్‌లను అనర్హులుగా ప్రకటించాలని ఆయా పార్టీలు కోరాయి. 
 
వీటిపై ఇటీవలే విచారణ చేపట్టిన తమ్మినేని సీతారాం... న్యాయనిపుణుల సలహా కూడా తీసుకున్నారు. ఆ తర్వాత సోమవారం రాత్రి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, టీడీపీకి చెందిన గంటా శ్రీనివాస రావు రాజీనామా వ్యవహారం న్యాయస్థానం పరిధిలో పెండింగ్‌లో ఉండటంతో ఆయన రాజీనామా ఆమోదంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది.