1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:58 IST)

ఏపీని ఆదుకోండి.. మోదీని కోరిన జగన్.. 143కి చేరిన కరోనా కేసులు

కరోనా వ్యాప్తితో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కరోనా వ్యాప్తితో దేశ వ్యాప్తంగా ఏర్పడిన అసాధారణ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీలో రెండు రోజుల్లో కేసులు వేగంగా పెరిగిపోయిన తీరును జగన్ ప్రధానికి వివరించారు.
 
ఏపీలో ఇప్పటివరకు 132 కేసులు నమోదయ్యాయని, వారిలో 111 మంది ఢిల్లీలో జరిగిన జమాత్‌ సభకు వెళ్లిన వారు, వారితో సన్నిహితంగా ఉన్నవారేనని చెప్పారు. ఏపీలో కుటుంబాల వారీగా సర్వే చేస్తున్నామని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలిస్తున్నామని చెప్పారు. కరోనా కారణంగా ఏపీ ఆదాయం బాగా దెబ్బతిందని జగన్‌ తెలిపారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన మోదీని కోరారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వైద్య పరికరాలను అందించాలని చెప్పారు. 
 
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 6 గంటల్లోపు 11 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్యాంధ్ర, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "రాష్ట్రంలో ఈ రోజు (02.04.2020) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:00 వరకు కృష్ణా జిల్లాలో 8 కేసులు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 143కి చేరింది" అని పేర్కొంది.