సెలెక్ట్ కమిటీలో రాజధాని వికేంద్రీకరణ బంతి.. ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి బుధవారం రాత్రి తీసుకున్న అత్యంత కీలక నిర్ణయంతో రాష్ట్ర రాజధాని వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీ ముందుకు వచ్చింది. అంటే, ఈ బిల్లుపై నిర్ణయం వెల్లడించేందుకు మూడు నెలల సమయం లేదా అంతకుమించి పట్టొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి అనే అంశంపై న్యాయనిపుణులు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రస్తుతం శాసనమండలిలో అధికార వైకాపా కంటే విపక్ష తెలుగుదేశం పార్టీకే సంపూర్ణ బలం ఉంది. దీంతో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను తోసిపుచ్చే అవకాశాలే మెండుగా ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో సెలెక్ట్ కమిటీని త్వరగా ఏర్పాటు చేసి, ఈ కమిటీ ద్వారా నివేదికను వీలైనంత త్వరగా తెప్పించుకుని... మళ్లీ అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి రెండోసారి వాటిని మండలికి పంపించడం ప్రభుత్వం ముందున్న ఒక మార్గం. అప్పుడు మండలి నిర్ణయంతో సంబంధంలేకుండా అసెంబ్లీ చేసిన నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది.
ఇక రెండో మార్గం... ఆ రెండు బిల్లులను ఉపసంహరించుకుని, తాము అనుకున్న నిర్ణయంపై ఆర్డినెన్స్ జారీ చేయడం. ఈ ఆర్డినెన్స్ జారీ చేసిన ఆరు వారాల్లోపు ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అసెంబ్లీలో అధికారపక్షం దీనిని నెగ్గించుకున్నప్పటికీ... మండలిలో మాత్రం మళ్లీ సీన్ రిపీట్ అవుతుంది.
ఒకవేళ శాసనమండలి కూడా ఈ ఆర్డినెన్స్‌ను పాస్ చేసినా దాన్ని రాష్ట్రపతికి పంపించాల్సి వుంటుంది. అక్కడ ఒకే రాజధాని నినాదాన్ని బలంగా వినిపిస్తున్న మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీలు కలిసి కేంద్రంలో చక్రం తిప్పి.. ఈ ఆర్డినెన్స్‌ను తిప్పి పంపే ఆస్కారం ఉంది. ఎటు చూసినా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.