మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 4 జనవరి 2022 (13:07 IST)

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ భేటీ

న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం వైయస్‌.జగన్‌ భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు ఈ సమావేశం జ‌రిగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు సీఎం కేంద్ర‌మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డీపీఆర్‌ తయారీ అంశంపై జ‌గ‌న్ చర్చించారు. 
 
 
విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని తెలిపారు. సముద్ర తీరాన్ని ఆనుకుని బీచ్ కారిడర్‌ ప్రాజెక్టులకు సమీపం నుంచి ఈ రోడ్డు వెళ్తుందని సీఎం వివ‌రించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు, ఈ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం అత్యంత దోహపడుతుందన్నారు.
 
 
విశాఖ నగరంలో వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లైనుల రహదారిని నిర్మించాల‌ని సీఎం జ‌గ‌న్ నితిన్ గ‌డ్క‌రీని కోరారు. విజయ‌వాడ తూర్పు బైపాస్‌పై గతంలో చేసిన విజ్ఞప్తిని చురుగ్గా పరిశీలించాలని విజ్ణ్న‌ప్తి చేశారు. సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు ఖర్చు తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఎస్జీఎస్టీ, రాయల్టీ మినహాయింపులిస్తామన్నారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.  
 
 
ఇక తూర్పుగోదావ‌రి జిల్లా కత్తిపూడి – ఒంగోలు కారిడర్‌లో భాగంగా ఎన్‌హెచ్‌–216 నిర్మాణానికి సంబంధించి బాపట్లలో 4 లేన్ల రోడ్డు విస్తరించాలని కోరారు. విద్యాసంస్థలు, పర్యాటకులు, ఎయిర్‌బేస్‌ కారణంగా మళ్లీ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని, ప్రస్తుతం బాపట్ల ద్వారా వెళ్తున్న రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాలంటూ విజ్ఞప్తి చేశారు.