బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 జులై 2024 (12:18 IST)

మెగా డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పిన విద్యామంత్రి నారా లోకేశ్

nara lokesh
ఏపీలో గత ప్రభుత్వంలో డీఎస్సీ పరీక్ష కోసం దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు ప్రస్తుత విద్యా మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. కొత్త ప్రభుత్వం జారీ చేసే మెగా డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గత ప్రభుత్వంలో డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించిన ఫీజును మినహాయిస్తున్నట్టు ప్రకటించారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణ అంశాపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 
 
టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించాలని అధికారులకు సూచించినట్టు నారా లోకేశ్ వెల్లడించారు. ఇక టెట్ సిలబస్ మార్పు అంటూ జరుగుతున్నది తప్పుడు ప్రచారం అని స్పష్టం చేశారు. సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయడంలేదని తెలిపారు. టెట్ సిలబస్ వివరాలకు https://aptet.apcfss.in వెబ్ పోర్టల్‌ను సందర్శించాలని లోకేశ్ సూచించారు.
 
'మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు ఎదురైన న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ మెగా డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించాను' అని లోకేశ్ వివరించారు.