గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (18:52 IST)

తలకిందులుగా జపం చేసినా బాబును సీఎంను చేయలేరు : కొడాలి నాని

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేయడం తలకిందులుగా తపస్సు చేసినా సాధ్యం కాదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, సీఎం జగన్‌కు చెడ్డ పేరు తీసుకొచ్చే పనిలోనే చంద్రబాబు, ఆయన తోక పత్రికలు పని చేస్తున్నాయని ఆరోపించారు. 
 
అయితే, చంద్రబాబుతో ఆయన బ్యాచ్ తలకిందులుగా తపస్సు చేసినా బాబును ముఖ్యమంత్రిని చేయలేరని మంత్రి కొడాలి నాని జోస్యం చెప్పారు. ఇకపోతే, ఏపీ ధాన్యం విదేశాలకు ఎగుమతి అవుతుందని, అదీ కూడా కేజీ 25 రూపాయలకే ఎగుమతి చేస్తున్నట్టు చంద్రబాబు తోక పత్రికలు వార్తలు రాశారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు రాతలు రాసే పత్రికలు తోక పత్రికలుకాక మరేంటని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్‌ను భ్రష్టు పట్టించాలన్న ఏకైక లక్ష్యంతో ఈ పత్రికలు పని చేస్తున్నాయని మండిపడ్డారు. 
 
విదేశాలకు ధాన్యాన్ని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు... బీహార్, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. తమ ప్రభుత్వం వచ్చాక అనేక మార్పులు చేశామని, రైతులు ఏ పంట వేశారో ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో మిల్లుల్లో ధాన్యం కొనుగోలు చేస్తే, తమ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని మంత్రి వివరించారు.