వధువు అలసిపోయింది.. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో కుప్పకూలింది..
పెళ్లికి అంతా సిద్ధమైంది. తాళికట్టడమే తరువాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ మొదలయింది. ఇంతలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. వధువు పెళ్లి వేదికపైనే కుప్పకూలింది. అంతేకాదు ప్రాణాలు కూడా కోల్పోయింది. ఈ ఘటన విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. విశాఖ, మధురావాడ, పాలెంలో బుధవారం రాత్రి నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. కానీ జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు కంగారుపడి ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది.
పెళ్లికూతురు బాగా అలసిపోవడంతోనే నీరసంగా కనిపించిందని.. కానీ ఇలా ప్రాణాలు కోల్పోతుందని భావించలేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.