గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (15:04 IST)

కూల్చడం మినహా నిర్మించడం చేతకాని నేత జగన్ : చంద్రబాబు ఫైర్

chandrababu
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. కూల్చడం మినహా నిర్మిచడం చేతకాని ముఖ్యమంత్రి అంటూ మండిపడ్డారు. గత తెదేపా హయాంలో విజయవాడ కరకట్ట సమీపంలో నిర్మించి ప్రజావేదికను కూల్చివేసి నేటి మూడేళ్ళు అయింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై నిర్మించిన ప్రజావేదికను కూల్చేసి నేటికి మూడేళ్లు గడిచాయని గుర్తుచేశారు. 
 
కూల్చివేతపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఇది కూల్చివేతల ప్రభుత్వమని మండిపడ్డారు. తన విధ్వంస పాలన ఎలా ఉండబోతోందో ప్రజలకు చెప్పడానికి అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి చేసిన మొట్టమొదటి పని ప్రజావేదిక కూల్చివేత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.కోట్ల విలువైన ప్రజల ఆస్తిని ధ్వంసం చేస్తూ తన ఆలోచనలు ఎలా ఉంటాయో రాష్ట్రానికి సీఎం వివరించి నేటికి మూడేళ్లు గడిచిందని వ్యాఖ్యానించారు.
 
డిస్ట్రక్షన్ తప్ప కన్‌స్ట్రక్షన్‌ చేతగాని జగన్ చేసినవన్నీ కూల్చివేతలేనని.. రాష్ట్ర అభివృద్ధిని, ఆర్థిక స్థాయిని, ప్రజాస్వామ్య వ్యవస్థలను, దళితుల గూడును, యువత భవితను కూల్చేశారని ఆక్షేపించారు. ప్రజారాజధాని అమరావతిని, పోలవరం కలను చిదిమేసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. ప్రజావేదిక కూల్చి వికృతానందం పొందిన జగన్.. ఈ మూడేళ్ల పాలనలో కట్టింది మాత్రం శూన్యం అని అన్నారు.