ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తాం.. చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద రూ. 15 వేలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం.. వారికి మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పథకాన్ని ప్రారంభించారు చంద్రబాబు.
అనంతరం మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు మరో శుభవార్త వినిపించారు. ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్ తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు ఉపయోగకరంగా ఉండేలా ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేసి వాటి ద్వారా బుకింగ్‌లు వచ్చేలా చూస్తామని అన్నారు.
ఇలా యాప్ అందుబాటులోకి తీసుకువస్తే ప్రయాణికులు ఆటో కోసం ఆటో స్టాండుకు వెళ్లి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ సదుపాయం నచ్చిన డ్రైవర్లు మాత్రమే ఇందులో ఎన్‌రోల్ చేసుకోవచ్చు.
ఇందుకోసం డ్రైవర్లు ఎవరికి కమిషన్లు కూడా చెల్లించే పని లేదు. ఆటో డ్రైవర్లతో పాటుగా మాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు కూడా అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. వారంతా క్రమశిక్షణగా ఉండాలన్నారు. రూల్స్ అతిక్రమించవద్దని.. క్రమశిక్షణతో ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించాలని సూచించారు.