శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (12:44 IST)

8న పులివెందులకు సీఎం జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 8వ తేదీ గురువారం పులివెందులకు రానున్నారు. గురువారం మాజీ మంత్రి, తన సొంత బాబాయి అయిన వైఎస్‌ వివేకానందరెడ్డి జయంతి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ హాజరై అదేరోజు సాయంత్రం పులివెందులలో వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ఆర్‌అండ్‌బీలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 

అలాగే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 8వ తేదీ కియ పరిశ్రమను సందర్శించనున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారికంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నవరత్నాల అమలుపై నివేదిక తయారు చేయాలన్నారు. ఆయాశాఖల్లో ఉన్న సమస్యలకు సంబంధించిన నివేదిక కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం కియ సందర్శన నేపథ్యంలో ఆ సంస్థ యాజమాన్యంతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయాలని ఇన్‌చార్జి జేసీ సుబ్బరాజు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్లను ఆదేశించారు.
 
మరోవైపు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో అరకు లోయలో ఈనెల 9న నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఐటీడీఏ ప్రధాన కేంద్రాల్లోనూ వేడుకలు నిర్వహించాలని, నాన్‌ ఐటీడీఏ ప్రాంతాలకు సంబంధించి జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. వేడుకలకు రూ.75 లక్షలు మంజూరు చేస్తూ గిరిజన శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలిచ్చారు.