మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 3 నవంబరు 2021 (11:11 IST)

టపాసులు పేలిస్తే... కొవిడ్ పెరిగిపోతుంద‌ట‌!

భార‌త‌దేశంలో కొవిడ్ మూడో ముప్పు మ‌ద‌లైంది అంటున్నారు. మరోవైపు చలికాలం మొదలైంది. అందులోనూ దీపావళి వచ్చేసింది. బాణసంచా వల్ల పెరిగే వాయు కాలుష్యం కొవిడ్‌ వ్యాప్తికి ఊతం కావచ్చని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు కరోనా వైరస్‌ ప్రభావ తీవ్రత పెరుగుతుందని, సాధారణ సమయాల్లో కంటే కాలుష్యంలో వైరస్‌ అతివేగంగా వ్యాప్తి చెందుతుందని వివరిస్తున్నారు.
 
 
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 6,71,623 మంది కొవిడ్‌ బారినపడగా, వీరిలో 6,63,691 మంది చికిత్స పొంది కోలుకున్నారు. కోలుకున్న వారిలోనూ సుమారు 2-3 శాతం మందిని దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశాలపై కొవిడ్‌ దుష్ప్రభావం వల్ల కొందరు ఇళ్ల వద్దనే ఉండి ఆక్సిజన్‌ తీసుకుంటున్నారు. బాణసంచా పొగ తెచ్చే కాలుష్యం ముప్పు ఇటువంటి వారిపై తీవ్రత ప్రభావం చూపుతుందని.. కాలుష్యాన్ని వాహకంగా చేసుకొని శ్వాసకోశాలపై వైరస్‌ తీవ్ర దాడికి తెగబడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాణసంచా పొగతో పాటు వైరస్‌ శ్వాసకోశాల్లోకి చేరితే ముప్పు తీవ్రత అధికంగా ఉంటుందని అంటున్నారు. 
 
 
సాధారణంగా మంచు వాతావరణంలో గాలి కదలిక నెమ్మదిస్తుంది. బాణసంచా కాల్చడం వల్ల వెలువడే పొగ వల్ల కూడా గాలి స్తంభించిపోతుంది. కాలుష్యాల కారణంగా విడుదలయ్యే అతిసూక్ష్మ ధూళికణాలు గాలిలో తేలియాడుతుంటాయి. వీటితో కరోనా వైరస్‌ అతుక్కుపోయి, మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు శ్వాసకోశాల్లోకి చేరిపోతుంది. వైరస్‌ శరీరంలోకి మరింతగా చొచ్చుకుపోవడానికి కాలుష్యాన్ని ఒక వాహకంగా వాడుకుంటుంది. 
 
 
దీనివ‌ల్ల ఇప్పటికే కొవిడ్‌ బారినపడి ఊపిరితిత్తులు దెబ్బతిన్నవారు, సీఓపీడీ, ఆస్తమా బాధితులు, ఇంట్లో కృత్రిమ ఆక్సిజన్‌ పొందుతున్నవారికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఇక తీవ్ర అలర్జిక్‌ ఇన్‌ఫెక్షన్లకు గురయ్యేవారు, మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్‌ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు సూక్ష్మ ధూళికణాలు మూడింతలు కావ‌డం వ‌ల్ల తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారు.
 
 
దీపావళికి ముందుతో పోల్చితే.. బాణసంచా కాల్చిన తర్వాత సూక్ష్మ ధూళికణాలు, అతి సూక్ష్మ ధూళికణాలు అనూహ్యంగా 30-40 రెట్లు అధికంగా పెరుగుతున్నట్లుగా మన దేశంలో ఇప్పటికే గుర్తించారు. గతేడాది హైదరాబాద్‌లో దీపావళి ముందు సూక్ష్మ ప్రమాదకర ధూళి కణాలు (పీఎం) సగటున ఒక క్యూబిక్‌ మీటరు గాలిలో సుమారు 80-90 మైక్రోగ్రామ్‌లు నమోదు కాగా.. దీపావళి రోజున దాదాపు రెండింతలయ్యాయి. అదే అతి సూక్ష్మ ప్రమాదకర ధూళికణాలు (ఎస్‌పీఎం) కూడా సాధారణ రోజుల్లో కంటే దీపావళి రోజుల్లో దాదాపు మూడింతలు పెరుగుతున్నట్లు జాతీయ కాలుష్య నియంత్రణ మండలి అంచనా వేసింది.
 
 
ట‌పాసుల్లో కార్బన్‌, సల్ఫర్‌, మెగ్నీషియం, పొటాషియం తదితర ఖనిజాలుంటాయి. వాటిని కాల్చినప్పుడు కార్బన్‌డై ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి విషతుల్య వాయువులు వెలువడతాయి. వీటితో పాటు ప్రమాదకర సూక్ష్మ, అతి సూక్ష్మ ధూళి కణాలు కూడా విడుదలవుతాయి. పొగ వచ్చే బాణసంచా వల్లనే ముప్పు ఉంటుందని ఎక్కువమంది అనుకుంటారు. కానీ రంగులు వెదజల్లే బాణసంచాతోనూ రసాయనాలు విడుదలవుతాయి. ఇవి ఊపిరితిత్తులపై దుష్ప్రభావం చూపుతాయి. వాయు కాలుష్యం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పితో పాటు కొవిడ్‌ కూడా విజృంభించే అవకాశాలున్నాయి.