శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2024 (09:34 IST)

ఫోటో షూట్‌ల కోసం తీసుకెళ్లి.. అత్యాచారం చేసి హాస్టల్‌లో దింపాడు..

victim
ఏలూరులోని శ్రీ స్వామి సరస్వతీ సేవా ఆశ్రమంలోని మహిళా వసతి గృహంలో వారిని వార్డెన్ భర్త లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన బట్టబయలు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు 50 మంది బాలికలు ఇక్కడ నివాసముంటూ వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు.
 
హాస్టల్ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన శశికుమార్ యర్రగుంటపల్లిలోని ప్రభుత్వ బీసీ హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్నారు. అతను తన రెండవ భార్య మణిశ్రీని వార్డెన్‌గా, తన మేనకోడలు లావణ్యను బాలికల సంరక్షకురాలిగా నియమించాడు.
 
హాస్టళ్లలో ఆశ్రయం పొందుతున్న బాలికలను ఫొటో షూట్‌ల పేరుతో శశికుమార్ ప్రలోభ పెట్టేవాడు. ఫొటో షూట్‌ల కోసం అమ్మాయిలను దూర ప్రాంతాలకు తీసుకెళ్లేవాడని, అక్కడ కూడా తమను దుర్భాషలాడాడని బాధితులు ఆరోపిస్తున్నారు. తనకు సహకరించకపోతే వారిని కూడా కొట్టేవాడు.
 
 ఈ క్రమంలో ఈ నెల 15న ఆదివారం ఓ బాలికను ఆటోలో ఎక్కించుకుని బాపట్లకు తీసుకెళ్లి అత్యాచారం చేసి 16వ తేదీ సోమవారం రాత్రి మళ్లీ తీసుకొచ్చి హాస్టల్‌లో దించాడు. రాత్రి అమ్మాయి బట్టలు ఉతుకుతూ ఏడుస్తూ తనకు జరిగిన అకృత్యాన్ని తోటి విద్యార్థులతో వెల్లడించింది. 
 
అదే సమయంలో జరిగిన విషయాన్ని బాలిక తన స్నేహితులకు చెప్పిందని తెలుసుకుని అక్కడికి వచ్చిన శశికుమార్ అక్కడున్న బాలికలందరినీ మోకాళ్లపై కూర్చోబెట్టి దారుణంగా కొట్టాడు. వార్డెన్ వేధింపులు భరించలేక ముగ్గురు బాలికలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వార్డెన్‌పై ఫిర్యాదు చేశారు.
 
బాధిత బాలికల తల్లిదండ్రులు, బంధువులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హాస్టల్‌లో తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అడ్డుకుంటే దాడికి పాల్పడ్డాడని బాధితులు పోలీస్ స్టేషన్‌లో కన్నీరుమున్నీరయ్యారు. పదుల సంఖ్యలో బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారని బాధిత బాలికలు చెబుతున్నారు.
 
ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ హాస్టల్‌ను తనిఖీ చేసి బాలికల వాంగ్మూలాలను నమోదు చేశారు. నిందితులు, అతడికి సహకరించిన వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం నిందితుడు శశికుమార్ పరారీలో ఉన్నాడు.