గ్రామ సర్పంచ్ వెంకటరమణమూర్తి హత్యకు కాల్పులు
శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పుల మోత మోగింది. జిల్లాలోని రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణమూర్తిని హత్య చేసేందుకు మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కొందరు తుపాకీతో కాల్పులు జరిపారు. గ్రామ సర్పంచ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులకు తెగబడ్డారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, మంగళవారం అర్థరాత్రి మరురానగర్‌లో సర్పంచ్ కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ వెళ్లగా, ఆమె మరో ఇద్దరు వ్యక్తులను కూడా సర్పంచ్ వద్దకు తీసుకెళ్లింది. ఆ మహిళ సర్పంచ్‌తో ఏదో మాట్లాడుతున్న సమయంలో ఆమెతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు గ్రామ సర్పంచ్‌పై కాల్పులు జరిపి అక్కడ నుంచి పారిపోయారు.
ఈ కాల్పుల ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గ్రామ సర్పంచ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కాల్పులు జరిపిన వారి కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రెండు తుపాకీ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైంది.